చిరంజీవి పై సీఐడీ అస్త్రం!

 

chiranjeevi kiran kumar reddy, cm kiran kumar reddy chiranjeevi

 

 

కేంద్ర పర్యాటక శాఖమంత్రి చిరంజీవికి సీఎం కిరణ్ ఝలక్ ఇచ్చారు. చిరంజీవే లక్ష్యంగా సీఐడీ అధికారులు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కార్యాలయంపై దాడిచేసి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ ప్లాట్ల కేటాయింపులో పలు అక్రమాలు జరిగాయని చాలా కాలం కిందటే ఆరోపణలొచ్చాయి. కొన్ని ప్లాట్లను అనర్హులకు కేటాయించారని, పార్కింగ్ స్థలాలను కూడా ప్లాట్లుగా మార్చేశారని అప్పట్లో అన్నారు.

 

ప్రస్తుత డీజీపీ దినేష్‌రెడ్డి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా ఉన్న కాలంలోనే ఈ వ్యవహారాలన్నింటిపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అప్పటి నుంచి అది ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ఉన్నట్లుండి సీఐడీ అధికారులు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కార్యాలయంలో సోదాలు చేశారు.


ఎప్పుడో ఏళ్ల క్రితంనాటి వ్యవహారాల్లో సీఐడీ ఇప్పుడు ఎందుకు హడావుడి చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవికి జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ పరిధిలోనే సొంత ఇల్లు, బ్లడ్‌బ్యాంకు ఉన్నాయి. చిరంజీవి ఇంటివద్ద కొంత భూమిని ఆయన కబ్జా చేసి ఉపయోగించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. సొసైటీ కార్యాలయంపై దాడిచేసిన అధికారులు ఆ ఫైలునే ప్రధానంగా టార్గెట్ చేసినట్టు సమాచారం. సీఎం కిరణ్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్న చిరంజీవి వర్గాన్ని ఇబ్బంది పెట్టాలనే ఈ చర్యలకు పాల్పడి ఉంటారని పుకార్లు వినిపిస్తున్నాయి.