చింతమనేనిపై ఉపముఖ్యమంత్రి కెఈ ఆగ్రహం

 

తెదేపా దెందులూరు ఎమ్మేల్యే మరియు ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్, అనుచరులు ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొన్నందుకు కృష్ణా జిల్లా ముసునూరు తహసిల్దార్ వనజాక్షి ఆమెతో వచ్చిన రెవెన్యూ సిబ్బందిపై దాడి చేయడాన్ని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణ మూర్తి ఖండించారు. ఈ ఘటనపై వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ని కోరారు. విధి నిర్వహణలో ఉన్న తహసిల్దార్, రెవెన్యూ సిబ్బందిపై దాడికి పాల్పడిన వారందరిపై కటిన చర్యలు తీసుకొంటామని అన్నారు. ఆంద్రప్రదేశ్ మానవ హక్కుల కమీషన్ ఈ కేసును సుమోటోగా స్వీకరించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చింతమనేనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఆయన ఆదేశాల మేరకే ఉప ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ కి లేఖ వ్రాసినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందుఇటువంటి కేసులేవీ తనను ఏమీ చేయలేవని చెప్పిన చింతమనేని ముఖ్యమంత్రి కూడా తనపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో జరిగిన సంఘటనకు చింతిస్తున్నానని తహసిల్దార్ వనజాక్షికి క్షమాపణలు తెలిపారు.