పాక్ పై మళ్లీ మాట మార్చిన చైనా..

 

పాకిస్థాన్ పై అగ్రదేశాలు సైతం వ్యతిరేక భావం చూపించినా చైనా మాత్రం ఎప్పుడూ తన సపోర్టును ఇస్తూనే ఉంటుంది. అయితే ఈసారి మాత్రం పాకిస్థాన్ విషయంలో చైనా మాట మార్చింది. ప్రస్తుతం భారత్-పాక్ దేశాల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనికి గాను పాక్ లో చైనా రాయబారి యు బోరెన్ స్పందించి భారతదేశంతో కనుక యుద్దం వస్తే పాక్ కు చైనా అండగా ఉంటుందని చెప్పారు. అయితే బోరెన్ చేసిన  వ్యాఖ్యలను చైనా కొట్టిపారేసింది. యు బోరెన్ వ్యాఖ్యలపై తమకు సమాచారం లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ చెప్పారు. రెండు దేశాలు మాకు మిత్రదేశాలేనని..ఈ దేశాల విషయంలో తమ విధానం అత్యంత స్పష్టమని, విభేదాలను చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని చెప్పారు. కశ్మీర్ సమస్య నేటిది కాదని గుర్తు చేసిన ఆయన, ఇరు దేశాలూ చర్చల ద్వారా, శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. చైనా, భారత దేశాల మధ్య కూడా సరిహద్దుల సమస్య ఉందని, ఈ విషయంలో తాము చర్చలకే ప్రాధాన్యతను ఇస్తున్నామని షువాంగ్ చెప్పారు. మరి చైనా మాట మార్పుపై పాక్ ఎలా స్పందిస్తుందో చూడాలి.