'చైనా' స్నాచింగ్ కు పాల్పడుతున్న మోదీ!

మోదీ అధికారంలోకి వచ్చాక భారతీయుల గుండెల్లో మోదం వచ్చిందా? ఆయన విధానాలకు అన్ని వర్గాల నుంచీ ఆమోదం వచ్చిందా? డౌటే! ఇప్పటికీ మోదీని వెనకేసుకొచ్చే ఆయన భక్తులు బోలెడుమంది వుండొచ్చు. కాని, అంతే స్థాయిలో విమర్శకులు వున్నారు. మోదీ వచ్చాక ఉద్యోగాలు రాలేదు, ధరలు తగ్గలేదు, మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా లాంటివన్నీ ఒట్టి నినాదాలే అనే వారు బోలెడు. రోజు రోజుకి పెరుగుతున్నారు కూడా! కాని, మోదీ సెగ మనకంటే ఎక్కువగా చైనాకు తగులుతోంది! చైన్ స్నాచింగ్ లాగా మన నమో చైనా స్నాచింగ్ మొదలుపెట్టారు.. 


చైనాలోని ఒక ప్రముఖ పత్రిక గ్లోబల్ టైమ్స్. దాంట్లో తాజాగా ఓ ఆర్టికల్ వచ్చింది. దాని సారాంశం ఏంటంటే... చైనా కంపెనీలు ఇండియాకి తరలుతున్నాయి. ఇక్కడ మోదీ ప్రకటించిన మేకిన్ ఇండియా విధానం వాళ్లకు తెగ నచ్చుతోంది. దాంతో స్వంత దేశం చైనాను కాదని ఇండియా బాట పడుతన్నారు అక్కడి పారిశ్రామికవేత్తలు. ఈ మధ్యే ఒక పెద్ద స్మార్ట్ ఫోన్ కంపెనీ తన ప్రొడక్షన్ యూనిట్ ఇండియాకి మార్చేసింది. ఆ దెబ్బకి చైనాలో ఆ కంపెనీపై ఆధారపడ్డ చాలా మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఇంకా కొన్ని కంపెనీలు కూడా భారత్ వచ్చేద్దామాని ఆలోచిస్తున్నాయట!


చైనా నుంచి భారత్ వస్తోన్న కంపెనీల మెయిన్ టార్గెట్ మన మార్కెట్టే. ఇక్కడ కావాల్సినంత మంది కస్టమర్లు వుండటంతో ఇక్కడే తయారీ చేసి అమ్ముకునే ఆలోచనలో వున్నాయి. మరో వైపు చైనాలో మార్కెట్ ఈ మధ్య కాలంలో నిరాశజనకంగా వుంటోంది. ఆ దేశ జీడీపి తగ్గుతూ వస్తోంది. ఇవన్నీ కారణాలతో చైనీస్ కంపెనీలు ఇండియన్ ఫ్లైట్స్ ఎక్కి రయ్ మని ఇటుగా వచ్చేస్తున్నాయి. చైనీస్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లు ఇండియా తరలటంపై ఆందోళన వ్యక్తం చేసిన మీడియా ప్రభుత్వానికి అవ్వి వెళ్లకుండా చూసుకోవాలని సూచించింది. లేదంటే లక్షల మంది నిరుద్యోగులు అవుతారని చెప్పింది. అలా ఉత్సాహంగా చైనానుంచి హిమాలయాలు ఎక్కి ఇటు దూకేస్తోన్న కంపెనీలకు కూడా ఇండియన్ చట్టాలు, రూల్సు సరిగ్గా చూసుకోమని చెప్పింది! తరువాత ఇబ్బందులపాలవ్వాల్సి వస్తుందని హెచ్చరించింది!


చైనీస్ మీడియా గొంతులోని ఆందోళన చూస్తుంటే.. మోదీ మొదలుపెట్టిన మేకిన్ ఇండియా మనం ఆశించినంత కాకపోయినా చైనా లాంటి ప్రత్యర్థి దేశాలు ఇబ్బందిపడేంతగా మాత్రం సక్సెస్ అవుతోందని చెప్పొచ్చు!