సొంతగడ్డ నుంచే కేసీఆర్‌కు మంట పెట్టనున్న కోదండరామ్..!

తెలంగాణ ముఖ్యమంత్రిగా..తెలంగాణ రాష్ట్ర సమితి అధినేతగా పాలనాపరంగా..రాజకీయంగా తిరుగులేకుండా పరిపాలన చేస్తున్న కేసీఆర్‌కు, తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ రూపంలో పెద్ద విపత్తు ఎదురైంది. టీఆర్ఎస్ పాలన సంతృప్తికరంగా లేదని, హామీలు పట్టించుకోవడం లేదని కోదండరామ్ నోరు తెరిచారో లేదో టీఆర్ఎస్ దండు ఆయనపై దాడికి దిగింది. స్వరాష్ట్రం సిద్ధించాక సైలెంట్ అయిన టీజేఏసీ యాక్టివ్ కావడానికి ఇంతకన్నా మంచి ముహూర్తం దొరకదని గ్రహించిన కోదండరామ్ ప్రజల తరపున పోరాడటానికి మరింత చురుగ్గా పనిచేస్తాం అంటూ భీకర ప్రతిజ్ఞ చేశారు. ఎక్కడి నుంచో గొడవ చేస్తే అది కేసీఆర్‌కు నేరుగా తగలదని భావించిన కోదండరామ్ అందుకోసం సీఎం సొంత నియోజకవర్గాన్ని వేదిక చేసుకున్నారు.

 

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మెదక్ జిల్లాలో చేపట్టనున్న మల్లన్న సాగర్‌ రిజర్వాయర్ నిర్మాణం వల్ల భూములు కోల్పోయే రైతుల పక్షాన పోరాటం చేయాలని కోదండరామ్ డిసైడ్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాకతో పాటు దుబ్బాక నియోజకవర్గంలోని తోగుట మండలాల్లోని పలు గ్రామాల పరిధిలో మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రిజర్వాయర్ నిర్మాణానికి 21,441 ఎకరాలు సేకరించేందుకు అధికారులు భూమిని గుర్తించారు. ఈ భూములన్నీ తొగుట, కొండపాక మండలాల్లోని 18 గ్రామాలకు సంబంధించినవే. ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఈ గ్రామాలన్నీ ముంపునకు గురవుతాయి. భూసేకరణ నిమిత్తం 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయడానికి బదులు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసి 123, 214 జీవోలను వర్తింపచేస్తున్నారు.

 

ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి కేటాయించిన తర్వాత ఇక్కడ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఎకరా 50 వేలు కూడా పలకని చోట 50 లక్షలకు పలుకుతోంది.  ప్రభుత్వం ఎకరాకు రూ.5 లక్షల నుంచి 6 లక్షలు చెల్లించి చేతులు దులుపుకునేందుకు చూస్తుండటంతో నిర్వాసితులకు అన్యాయం జరుగుతోంది. దీంతో వీరు ఆందోళనకు దిగారు..తమకు పరిహారం కింద ఎకరాకు రూ.25 లక్షలు, భూమికి భూమి, పునరావాసం, జీవనోపాధి కల్పించాలని పోరుబాట పట్టారు. ఇక్కడ ఇంతపెద్ద ఆందోళన జరుగుతున్నా స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో బయటవారికి కనిపించడం లేదు. పైగా మంత్రులు, అధికారులు రైతుల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఫోకస్ చేసిన కోదండరామ్ వారికి అండగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. అసలు మల్లన్నసాగర్ రిజర్వాయర్‌పై ప్రజాభిప్రాయ సేకరణ జరగలేదన్న కోదండరామ్ నిర్వాసితులకు జేఏసీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ అంశంలో అవసరమైతే మేధాపాట్కర్ సాయంతో పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. మొత్తానికి కేసీఆర్ సొంతగడ్డ నుంచే మంటపెట్టడానికి కోదండరామ్ రెడీ అయ్యారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu