విశాఖకు హరికృష్ణ, ఎన్టీఆర్ వస్తారా?

 

 

  chandrabbau padayatra, chandrababu vastunna meekosam, tdp padayatra

 

 

తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విశాఖపట్నం బహిరంగ సభకు నందమూరి వారసులు ఎవరెవరు వస్తారన్న చర్చ జరుగుతోంది. ఈ సభలో పాల్గొనవలసిందిగా కోరుతూ పార్టీ నేతలకు, నందమూరి కుటుంబ సభ్యులకు, మిత్ర పక్షాల నేతలకు, దేశ విదేశాలలో ఉన్న పార్టీ అభిమానులకు టిడిపి ఆహ్వానాలు పంపింది. చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ తప్ప మిగతా నందమూరి కుటుంబ సభ్యులెవరూ ఈ సభలో పాల్గొనకపోవచ్చునని ప్రచార౦ జరుగుతోంది.


విశాఖలో చంద్రబాబు, బాలయ్య, లోకేష్ ప్లెక్సీలు మాత్రమే కనిపిస్తున్నాయన్న వార్తలు కూడా రకరకాల ఊహాగానాలకు తెరతీస్తున్నాయి. ఇటీవల ఫ్లెక్సీబ్యానర్లతో నందమూరి కుటుంబ సభ్యుల మద్య తలెత్తిన వివాదాల కారణంగా హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వెళ్లకపోవచ్చని చెబుతున్నారు. బాలకృష్ణ మినహా నందమూరి వారసులేవ్వరూ సభకు హాజరుకాకపోతే..ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళా తాయంటూ పార్టీ నేతలు కొందరు హరికృష్ణ ను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు.


మరోవైపు పాదయాత్ర ముగింపు సభకు టిడిపి కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నపార్టీ కార్యకర్తలు, నాయకులూ అందరు కలిసి దాదాపు 10లక్షల మంది వరకు రావచ్చునని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే 12 ప్రత్యేక రైళ్ళను, 500 బస్సులను, అనేక మినీ వ్యాన్లను ముందుగానే బుక్ చేసారు. అదేవిధంగా నగరంలో ఉన్న చిన్న పెద్దా హోటల్స్ మరియు గెస్ట్ హౌసులలో రూములు కూడా ఇప్పటికే చాలావరకు బుక్ అయిపోయినట్లు సమాచారం.

 

ఇంత భారీ ఎత్తున తరలి వస్తున్న జనాలను అదుపుచేసేందుకు పోలీసులు కూడా అదనపు బలాలను ఇతర జిల్లాల నుండి రప్పిస్తున్నారు. ఇక 26వ తేదీ నుండే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్ళింపులు ఉంటాయని పోలీసు అధికారులు తెలియజేసారు. సభాస్థలి జనసాంద్రత ఎక్కువ ఉండే నగరం నడిబొడ్డున ఉండటంతో పోలీసులు మరింత జాగురకతో వ్యవహరించాల్సి ఉంటుంది.



చంద్రబాబు తన 63 ఏళ్ల వయసులో దాదాపు 2,900కి.మీ. పాదయాత్ర దిగ్విజయంగా చేసుకొని ఇంత భారీ ఎత్తున ర్యాలీ, సభ నిర్వహించతుండటంతో పార్టీ కార్యకర్తలలో, నేతలలో మళ్ళీ చాలారోజుల తరువాత సమరోత్సాహం కనిపిస్తోంది.