ఏపీకి కేంద్రం మరో ఝలక్



కేంద్ర ప్రభుత్వం ఏపీకి మరోషాక్ ఇచ్చింది. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందా?రాదా అనే సందేహాలే ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ ప్రత్యేక హోదా విషయంపై నిన్న చర్చించిన విషయం తెలిసిందే. అయితే విభజన చట్టంలో ఉన్నహామీలన్ని నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఏపీ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తామని చెప్పింది కానీ ప్రత్యేక హోదాపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. కానీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాత్రం ప్రత్యేక హోదాపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి.. ప్రత్యేక హోదా విషయంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని.. హోదాకు బదులు రాష్ట్రానికి కావాల్సిన, దక్కాల్సిన సాయం అంతటిని కేంద్రం చేస్తుందని చెప్పారు. దీని బట్టి ప్రత్యేక హోదా చాలా వరకూ రానట్టే అని స్పష్టంగా అర్థమవుతోంది.



ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదాపై షాకిచ్చిన కేంద్రం విజయవాడ నగరానికి మెట్రో రైలు లేదని  చెప్పి మరో షాకిచ్చింది. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని భావించిన మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణానికి చుక్కెదురైంది. ఏ నగరంలోనైనా మెట్రోరైలు రావాలంటే ఆనగర జనాభా కనీసం 20 లక్షలకు పైగా ఉండాలని కానీ విజయవాడలో 15 లక్షల కంటే తక్కువ జనాభా ఉందని కాబట్టి విజయవాడకు మెట్రో అవసరం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. దీనికి సంబంధించిన లేఖను కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నెల రోజుల ముందే లేఖ రాసింది.