ఈవీఎంల వ్యవహరంపై సుప్రీంలో రివ్యూ పిటిషన్

 

ఏపీలో పోలింగ్‌ జరిగిన తీరుపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఉండవల్లిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ఉద్యమమని తెలిపారు. ఈ ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, కేసీఆర్‌, కరడుగట్టిన ఆర్థిక ఉగ్రవాది జగన్‌తో పోరాడాల్సి వచ్చిందన్నారు. వారికున్న అధికారాలన్నీ నీచంగా ఉపయోగించారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని అణగదొక్కడానికి సంకల్పించారని విమర్శించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే పోలింగ్‌ కేంద్రాల వద్ద అల్లర్లు జరిగాయని, ఈ చర్యలు జరిగే అవకాశముందని ముందే హెచ్చరిస్తే రాష్ట్ర ఉన్నతాధికారులందర్నీ మార్చేశారని విమర్శించారు.

ప్రజలను అన్ని విధాలా ఇబ్బందులకు గురి చేశారని.. హింస, దౌర్జన్యం వంటివి సృష్టించారని చంద్రబాబు ఆరోపించారు. ఉదయం 31 శాతం ఈవీఎంలు పని చేయకపోవడంతో పాటు, భయానక వాతావరణం సృష్టించారని విమర్శించారు. పలుసార్లు ఈవీఎంలు మొరాయించడంతో ప్రజలు పలుసార్లు కేంద్రాలకు తిరిగారని చెప్పారు. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా ఎండలను సైతం లెక్క చేయకుండా సుదూర ప్రాంతాల నుంచి ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఇంత పనికిమాలిన ఎలక్షన్ కమిషన్‌ను తానెప్పుడూ చూడలేదని చంద్రబాబు మండిపడ్డారు. నేరస్థులు చెబితే ఈసీ పాటిస్తోందన్నారు. వాళ్లు ఎవరిని బదిలీ చేయమంటే వాళ్లను బదిలీ చేశారు. ఈవీఎంలను రిపేర్‌ చేస్తామని చెప్పి ట్యాంపరింగ్ చేశారన్నారు. జగన్‌తో సహ నిందితుడిగా ఉన్నవారిని సీఎస్‌గా నియమిస్తారా? అని ప్రశ్నించారు. ఎన్నిక జరుగుతుంటే సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం-డీజీపీ ఆఫీసుకు ఎందుకెళ్లారని నిలదీశారు.

ప్రజల భవిష్యత్తును ఒక మిషన్ మీద వదిలిపెట్టారన్నారు. నిన్నటి ఈవీఎంల పనితీరు చూశాక నమ్మకం ఉంటుందా? అని ప్రశ్నించారు. పేపర్ బ్యాలెట్ అయితే రిపేర్లతో సంబంధం ఉండేదే కాదన్నారు. ఇది ఇక్కడితో ఆపనని.. ఢిల్లీకి వెళ్తానని.. ఈవీఎంల వ్యవహరంపై సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పారు. రేపే ఢిల్లీ వెళ్తానని.. ఎందుకిలా చేశారో ఈసీనే అడుగుతానని తెలిపారు. కొన్ని చోట్ల మధ్యాహ్నం ఒంటి గంట వరకూ పోలింగ్‌ మొదలు కాలేదని, రాత్రి 3.30 గంటలకు కూడా ఓటు వేసిన సందర్భం ఉందని చెప్పారు. ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత ఈసీపై ఉందని, దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఆర్బీఐ గవర్నర్‌ రాజీనామా, సీబీఐ వ్యవహారం, ఐటీని ఇష్టమొచ్చినట్లు వాడుకోవడం వంటివి ఇప్పటి వరకు చూశాం. ఇప్పుడు ఈసీని బీజేపీ కార్యాలయం మాదిరిగా మార్చుకున్నారని విమర్శించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ వైఫల్యమైతే ఇంతవరకూ వైసీపీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నారు. ఎన్నికలకు మూడు రోజుల ముందు జగన్‌ ప్రచారంలో పాల్గొనకుండా సెలవులో ఉన్నారు. ఆ సమయంలో హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో ఉండి కుట్రలు పన్నారు అని చంద్రబాబు ఆరోపించారు.