హోదాపై యుద్ధం చేయరా?.. చిరంజీవి జగన్‌ను ప్రాధేయపడాలా?
posted on Feb 14, 2022 5:28PM
వైసీపీ ఆడుతున్న ప్రత్యేక హోదా డ్రామాపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదాపై యుద్ధం చేయకుండా పలాయనవాదం ఎందుకని సీఎం జగన్‌ను చంద్రబాబు నిలదీశారు. ‘హోదా’ కోసం ఎంపీల రాజీనామాలపై నాటి మీ సవాళ్లు ఏమయ్యాయని నిలదీశారు. ప్రజలకు జగన్‌రెడ్డి సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
కేంద్ర హోంశాఖ అజెండాలో ప్రత్యేకహోదా అంశం తమ ఘనతగా చెప్పుకున్న వైసీపీ నేతలు.. ఇప్పుడు టీడీపీపై బురద చల్లడమేంటని ప్రశ్నించారు. ఏపీ ఆదాయం తగ్గకపోయినా ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని.. ఈశాన్య రాష్ట్రాల కంటే దారుణంగా ఏపీని దిగజార్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
లేని సమస్యను సృష్టించి జగన్‌రెడ్డి సినీ హీరోలను అవమానించారని చంద్రబాబు మండిపడ్డారు. స్వశక్తితో ఎదిగిన చిరంజీవిలాంటి వాళ్లు జగన్‌ను ప్రాధేయపడాలా? అని ప్రశ్నించారు. ప్రపంచస్థాయికి ఎదిగిన తెలుగు సినీ పరిశ్రమను కించపరిచారని విమర్శించారు.
విద్యార్థులకు బడులను దూరం చేయడమే నాడు నేడు పథకమా? అని ప్రశ్నించారు. కరెంట్ సరఫరా లేదు కానీ.. అధిక బిల్లులు మాత్రం వస్తున్నాయని.. విద్యుత్ మోటర్లకు మీటర్ల బిగింపును ప్రభుత్వం నిలిపివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఉపాధిహామీ పనుల్లో అవినీతిపై తెదేపా పోరాడుతుందని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంలో ఎందుకు చేతులు కట్టుకుని కూర్చున్నారో జగన్ చెప్పాలని నిలదీశారు.