జమ్మలమడుగు పంచాయితీ..టీడీపీ ఎమ్మెల్సీ రాజీనామా

 

ఎట్టకేలకు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పంచాయితీ కొలిక్కివచ్చింది. గత కొంతకాలంగా జమ్మలమడుగు నియోజకవర్గ అభ్యర్థి ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెరదించారు. 30 ఏళ్లపాటు ప్రత్యర్థులుగా ఉన్న రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి మధ్య రాజీ కుదర్చడంలో చంద్రబాబు విజయం సాధించారు. గత ( 2014 ) అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి, వైసీపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి విజయం సాధించి... కొంత కాలం తర్వాత టీడీపీలో చేరారు. అప్పటి నుంచి జమ్మలమడుగు నియోజకవర్గ టికెట్‌ రానున్న ఎన్నికల్లో (2019 ) వీరిద్దరిలో ఎవరికి దక్కుతుందనే అంశంపై రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయంపై పలు మార్లు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి.. చంద్రబాబు వద్ద చర్చలు జరిపారు. ఇద్దరూ కలిసి చర్చించుకుని ఒక నిర్ణయానికి రావాలని చంద్రబాబు సూచించారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఇద్దరు నేతలు పరస్పర అంగీకారానికి వచ్చారు.

జమ్మలమగుడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి పోటీ చేయాలని, కడప పార్లమెంట్‌ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి పోటీ చేయాలని, ఆదినారాయణరెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఒప్పందం మేరకు రామసుబ్బారెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు అందజేశారు. రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి ఒక్కటవ్వడంతో జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ భారీ మెజారిటీ కైవసం చేసుకుంటుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవిని ఆదినారాయణ రెడ్డి సోదరుడైన నారాయణ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.