ప్రశ్నిస్తే దేశద్రోహం కేసా? రాజా రెడ్డి రాజ్యాంగమా? 

మూడు అరెస్టులు.. ఆరు కేసులు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక పాలనంతా ఇలానే సాగుతుందనే చర్చ జనాల్లో సాగుతోంది. జనాలు అనుకుంటున్నట్లుగానే ఏపీలో వరుస పరిణామాలు జరుగుతున్నాయి. కొవిడ్ కల్లోల సమయంలోనూ కక్ష రాజకీయాలు ఆగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవలే టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టయ్యారు. మాజీ మంత్రి దేవినేని ఉమపైనా కేసు నమోదైంది. అంతకుముందు చాలా మంది టీడీపీ నేతలు అరెస్టయ్యారు. తాజాగా వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజును ఏపీ సీఐడీ అరెస్ట్ చేయడం ఏపీలో కలకలం రేపుతోంది. రఘురామ పుట్టినరోజునే ఆయన్ను అరెస్ట్ చేయడం రాజకీయ రచ్చగా మారింది. 

రఘురామ రాజు అరెస్టుపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. కరోనా వైఫల్యాలను ప్రశ్నించిన ఎంపీపై దేశద్రోహం కేసు వేస్తారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కరోనా విపత్కర సమయాల్లోనూ కక్ష సాధింపు చర్యలే ముఖ్యమా? అని ఆయన అన్నారు. జగన్‌ పాలనలో ప్రశ్నించే గొంతుకకు సంకెళ్లే బహుమతా?అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పగ, ప్రతీకారానికి వాడటం దుర్మార్గమని,  కరోనా వేళ ప్రజల ప్రాణాలపై దృష్టి సారించాలని చంద్రబాబు హితవు పలికారు. 

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్టు పూర్తిగా అప్రజాస్వామికమని టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు.  ఏపీలో జగన్‌రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో రూల్ ఆఫ్ లా లేదు.. అంతా రాజారెడ్డి రాజ్యాంగమే నడుస్తోందంటూ మండిపడ్డారు. రఘురామ అరెస్ట్ కక్ష సాధింపులో భాగంగానే జరిగిందని ఆరోపించారు. వారెంట్ లేకుండా ఎంపీని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. పోలీసులు ఖాకీ డ్రెస్సును పక్కనపెట్టి అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. 

మరోవైపు ఎంపీ రఘురామకృష్ణ రాజు అరెస్టుపై  సీఐడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎంపీ రఘురామకృష్ణరాజును  శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశామని, ఆయనపై ఐపీసీ 124ఎ, 153ఎ, 505, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని ఆ ప్రకటనలో వెల్లడించింది. కొన్ని వర్గాలకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇవ్వడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంతప్తిని ప్రేరేపించేలా రెచ్చగొడుతుండడం వంటి ఆరోపణలతో ఆయనపై ఫిర్యాదులు అందాయని, వాటి ప్రకారమే అరెస్టు చేశామని సీఐడీ వెల్లడించింది.