కరోనాపై చంద్రబాబు వార్! కుప్పంలో ఆక్సిజన్ ప్లాంట్ 

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. చిత్తూరు జిల్లాల్లో వైరస్ విజృంభణ రోజురోజుకు పెరిగిపోతోంది. హాస్పిటల్స్ లో బెడ్లు లేక, ఆక్సిజన్ అందక కరోనా రోగులు పిట్టల్లా రాలిపోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో కుప్పంలో కరోనా మహమ్మారిపై సమరశంఖం పూరించారు చంద్రబాబు. కుప్పం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల కోసం కోటి రూపాయలు ఖర్చు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. 

కుప్పం టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. స్థానికంగా కరోనా పరిస్థితులపై ఆందోళన వెలిబుచ్చారు. తన సొంత నిధులతో కుప్పం ప్రజలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. మొదట కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.35 లక్షల ఖర్చుతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కొరత ఉంటే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ద్వారా తక్షణమే నియామకాలు చేపట్టాలని స్థానిక అధికారులకు సూచించారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా కుప్పం నియోజకవర్గంలోని 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన ఔషధాలను పంపిస్తామని చంద్రబాబు తెలిపారు.

కరోనా రోగుల ఐసోలేషన్ కు ఉపయోగపడేలా కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 200 బెడ్లు, ఒకేషనల్ జూనియర్ కాలేజీ న్యూ బిల్డింగ్ లో 200 బెడ్లు ఏర్పాటు చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. దీనిపై చిత్తూరు జిల్లా కలెక్టర్ కు కూడా లేఖ ద్వారా వివరిస్తానని తెలిపారు. చంద్రబాబు ఆదేశాలతో కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలు రంగంలోకి దిగారు.