విద్యార్థుల తల్లిడండ్రులకు చంద్రబాబు వినతి
posted on May 14, 2019 10:54AM

ఏపీలో ఈరోజు పదో తరగతి ఫలితాలు విడుదలవనున్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు విద్యార్థుల తల్లిదండ్రులకు ట్విట్టర్ వేదికగా కీలక సూచనలు చేశారు. ఫలితాలు ఎలా ఉన్నా వారికి పిల్లలకు అండగా ఉండాలని సూచించారు. "విద్యార్థుల తల్లిడండ్రులకు నా వినతి.. ఆంధ్రప్రదేశ్ పదోతరగతి పరీక్షా ఫలితాల్లో మీ పిల్లల ఫలితాలు ఎలా ఉన్నా మీ అండ వారికి ఎంతో అవసరం. వారిని నిందించడం, ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడటం చేయకండి, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకండి. పిల్లలకు ధైర్యం చెప్పండి, ఈ ఫలితాలు తెలివి తేటలకు కొలమానాలు కాదని, కింద పడినా రివ్వున పైకి లేచే కెరటాల్లా రెట్టించిన ఉత్సాహంతో అద్భుత ఫలితాలను సాధించవచ్చని వారిలో ప్రేరణ కల్గించండి." అని ట్వీట్ చేశారు.