చంద్రబాబు వెర్సస్ కేసీఆర్
posted on Aug 5, 2014 9:33AM
.jpg)
ఇరుగుపొరుగు రాష్ట్రాలుగా మారిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలకు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చెప్పట్టడంతో వారిరువురి పనితీరును, వ్యవహారశైలిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. వారిరువురిని ఒకరితో మరొకరిని పోల్చి చూసినపుడు చంద్రబాబు నాయుడు చాలా నిదానంగా ఆచితూచి వ్యవహరిస్తుంటే, కేసీఆర్ మాత్రం చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నిర్ణయాలను ప్రకటించడంలో, అమలు చేయడంలో కూడా చాలా నిదానంగానే ముందుకు సాగుతున్నారు.
ఆంధ్ర ప్రభుత్వంతో నిత్యం ఘర్షణ పడుతూ కేసీఆర్ ముందుకు సాగుతుంటే, చంద్రబాబు మాత్రం చాలా సంయమనంతో వ్యవహరిస్తూ, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకొందామని సామరస్య ధోరణి ప్రదర్శిస్తూ అందరి మన్ననలు అందుకొంటున్నారు. ఫీజు రీ-ఇంబర్స్ మెంటు విషయంలో కేసీఆర్ రాజీలేని ధోరణిని ప్రదర్శిస్తుంటే, దాని వల్ల ఇరు రాష్ట్రాల నడుమ ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు చంద్రబాబు చొరవ తీసుకొని 58:42 నిష్పత్తిలో ఫీజు చెల్లిద్దామని ప్రతిపాదన చేయడం, విద్యార్ధుల భవిష్యత్ కాపాడేందుకు అవసరమయితే మరో మెట్టు దిగేందుకు తాను సిద్దమని ప్రకటించడం ఆయన రాజనీతికి అద్దం పడుతోంది. ఆ ప్రతిపాదనను కేసీఆర్ ప్రభుత్వం తిరస్కరించడమే కాకుండా ఈ విషయంలో కనీసం చర్చలకయినా చొరవ చూపకపోవడం గమనిస్తే ఇద్దరు ముఖ్యమంత్రుల వ్యవహార శైలిలో ఉన్న తేడా అర్ధమవుతుంది.
చంద్రబాబు నాయుడు కేంద్రప్రభుత్వంతో సయోధ్య పాటిస్తూనే, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు డిల్లీలో రాష్ట్రం తరపున ప్రత్యేక ప్రతినిధి కంబంపాటి రామ్మోహన్ రావును నియమించారు. కానీ, కేసీఆర్ మాత్రం కేంద్రంతో కూడా ఘర్షణ వైఖరి అవలంభించడమే కాకుండా, తెలంగాణా అభివృద్ధికి అసలు కేంద్రం మద్దతు అవసరమే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇక ఈ రెండు నెలల వ్యవధిలో కేసీఆర్ ప్రభుత్వాన్ని పరుగులు తీయిస్తుంటే, చంద్రబాబు కూడా మొదటిలో చాలా దూకుడుగా వ్యవహరించినప్పటికీ, ఆ తరువాత కొంచెం చల్లబడిపోయినట్లు కనబడుతున్నారు. బహుశః ప్రభుత్వం యొక్క ఆర్ధిక దుస్థితి ఆయనకు స్పీడుకు బ్రేకులు వేస్తుండవచ్చును.
కేసీఆర్ తెలంగాణా అభివృద్ధి, సంక్షేమ పధకాల పట్ల ఎక్కువగా శ్రద్ధ వహిస్తుంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పరిపాలనపరమయిన ఆడ్డంకులను ఒకటొకటిగా తొలగించి గాడి తప్పిన పాలనను తిరిగి గాడినపెట్టేందుకు కృషిచేస్తున్నారు. అక్షయపాత్ర వంటి హైదరాబాద్ కూడిన తెలంగాణా కేసీఆర్ కు వడ్డించిన విస్తరిలా దక్కితే, ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్న ఆంద్రప్రభుత్వం చంద్రబాబుకి దక్కింది. ఇరు ప్రభుత్వాల ఆర్ధిక స్థితిలో ఉన్న ఈ తేడా బహుశః ముఖ్యమంత్రుల పనితీరులో ప్రతిఫలిస్తోందని చెప్పవచ్చును.