బాబు, కిరణ్ కు సవాల్ గా మారిన తిరుపతి ఎన్నికలు
posted on Jun 7, 2012 2:01PM
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇద్దరూ ఈ జిల్లా వారే. దీంతో ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని దక్కించుకోవాలని వీరిద్దరూ పట్టుదలగా ఉన్నారు. స్ పట్టున్న ప్రాంతాల్లో వీరు ఎక్కువగా తిరుగుతున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తిరుపతి పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించిందని ఆరోపిస్తూ టిడిపి అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తితో సహా పలువురు నేతలు ప్రచారం చేసేశారు. కొన్ని సంఘాల పేరిట ముద్రించిన కరపత్రాలను తమ ప్రచారంలో భాగంగా పంచిపెట్టారు. వీరి ప్రచారశైలిని గమనించిన తన తరుపున ప్రచారం చేసేవారికి ఒక గ్రూపుగానూ, తాను ఒక గ్రూపుగానూ చీలిపోయి ప్రచారం చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి ఎం. వెంకటరమణ నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం ప్రచారం చేసిన 15 నిమిషాల తరువాత కాంగ్రెస్ ప్రచారం అదే ప్రాంతంలో జరిగేలా ఆయన ఏర్పాటు చేశారు. అంటే టిడిపిపై ఒక గ్రూపు కన్నేసి అనుసరించేలా వెంకటరమణ ఏర్పాట్లు చేయటం నేతలనూ ఇంకేమీ చేయొచ్చో అన్న ఆలోచనలకు పురిగొల్పింది. దీంతో సిఎం ఢిల్లీ నుంచి ఏ నేత వచ్చినా వదలకుండా ముందు తిరుపతి తీసుకువచ్చేస్తున్నారు. వాయలార్ రవి తరువాత గులాంనబీఆజాద్ కూడా రాగానే మొదట ఈ నియోజకవర్గం నుంచే ప్రచారం ప్రారంభించారు. ప్రముఖ నేతలతో పాటు తిరుగుతూనే వెంకటరమణ తనకు సహాయం చేస్తామన్న నేతలనూ మధ్యమధ్యలో పలకరిస్తున్నారు. ఇటు ఓటు అభ్యర్థిస్తూనే అటు సెల్ లో వారి సహకారం ఏ రూపంలో అందుతోందో కనుగొంటున్నారు. మంత్రి పార్థసారథి, జిల్లా ఇన్ ఛార్జీ మంత్రి రఘువీరారెడ్డిలతో పాటు ఇప్పటిదాకా అలిగిన గల్లా అరుణకుమారి తదితరులను కలుపుకోవటంలో వెంకటరమణ విజయం సాధించారు.
ఐక్యతతో భారీ స్థాయిలో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ తరువాత వ్యూహం ఎవరకీ అర్థం కాకుండా సిఎం తీసుకున్న జాగ్రత్తలను అనుసరిస్తూనే అభ్యర్థి వెంకటరమణ ఇతర పార్టీల వ్యూహాలను కిరణ్ కు తెలియజేస్తున్నారు. తాజా సమాచారాలు అందటంతో సిఎం కూడా ఎప్పటికప్పుడు తాము చేసే కార్యక్రమాలను ఎలా మార్చుకోవాలో వెంకటరమణకు సూచనలు ఇస్తున్నారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ శంకరరెడ్డి ఓటుబ్యాంకుపై, టిటిడి మాజీ ఛైర్మన్ ఆదికేశవుల నాయుడు ఓటుబ్యాంకు పై దృష్టి సారించిన సిఎం తన సోదరుడి ద్వారా వీరిద్దరి కార్యక్రమాలను తెలుసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కడప ఎన్నికల ప్రచారానికి వెళ్లాలనుకున్నప్పుడల్లా టిడిపి అధినేత చంద్రబాబు ఈ నియోజకవర్గంలో ఆగి పరిస్థితి సమీక్షిస్తున్నారు. కాంగ్రెస్ ఉత్సాహాన్ని ఎలా దెబ్బతీయాలో తమ కార్యకర్తలకు సూచిస్తూనే గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జా గోపాలకృష్ణలు నియోజకవర్గంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు బాబు నిర్దేశిస్తున్నారు. మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవేందర్ గౌడ్ తదితరులు చేసిన ప్రచారం వల్ల ఉండే ప్రయోజనాలను సమీక్షిస్తూనే అభ్యర్థి చదలవాడ కృష్ణమూర్తిని కొత్తతరహాలో ఆలోచనలు చేయమని బాబు ప్రోత్సహిస్తున్నారట. ఇలా వ్యూహప్రతివ్యూహల్లో ఈ రెండు పార్టీలూ పోటీపడుతున్నాయి. కాంగ్రెస్ లో ఐక్యతను చెదరగొట్టేందుకు తెలుగుదేశం వేసిన ఎత్తుగడలు ఇప్పటిదాకా ఫలించలేదు. కానీ, బాబు రాజకీయ అనుభవంతో చేసే ప్రతీ పని ఫలితమిస్తుందని, ఎన్నికలు దగ్గరయ్యేటప్పటికి వాతావరణం తమకు అనుకూలమవుతుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.