కేంద్ర మంత్రి సోదరుడికే బెడ్ దొరకలేదు!

దేశంలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. సెకండ్ వేవ్ భయంకరంగా ఉండటంతో దారుణ పరిస్థితి నెలకొంటున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ లో పరిస్థితి చేయి దాటి పోయిందని తెలుస్తోంది. మంత్రుల కుటుంబ సభ్యులకు కరోవా సోకినా... హాస్పిటల్స్ లో బెడ్లు దొరకని పరిస్థితి ఉందంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో ఊహించవచ్చు. 

తన సోదరుడికి కరోనా సోకిందని, ఆసుపత్రిలో అతడికి ఓ పడకను ఏర్పాటు చేయాలని ఘజియాబాద్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ కేంద్రమంత్రి వీకే సింగ్ ట్వీట్ చేయడం కలకలం రేపుతోంది.  కేంద్ర మంత్రి తన ట్వీట్‌కు ఘజియాబాద్ జిల్లా కలెక్టర్‌ను ట్యాగ్ చేశారు. ఆసుపత్రిలో బెడ్ కేటాయించాలంటూ స్వయంగా కేంద్రమంత్రి చేసిన ట్వీట్ కాసేపటికే వైరల్ అయింది. కరోనా చికిత్సకు బెడ్ కోసం కేంద్రమంత్రే కలెక్టర్  కు విజ్ఞప్తి చేయడ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. 

శివసేన నాయకురాలు, ఎంపీ ప్రియాంక చతుర్వేది మంత్రి ట్వీట్‌పై స్పందిస్తూ ఆసుపత్రిలో ఓ బెడ్ కోసం సాక్షాత్తూ ఓ మంత్రే ఇలా ట్వీట్ చేయడం ఆయన నిస్సహాయతకు అద్దం పడుతోందంటూ ట్వీట్ చేశారు. కరోనా సోకిన ఆ వ్యక్తి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ప్రియాంక చతుర్వేది ట్వీట్‌పై స్పందించిన వీకే సింగ్.. నిజానికి ఆయన తన సోదరుడేమీ కాదని, తన నియోజకవర్గ పరిధిలోని ఓ వ్యక్తి అని వివరణ ఇచ్చారు. అధికారులు వేగంగా స్పందిస్తారన్న ఉద్దేశంతోనే తాను ఆ ట్వీట్ చేసినట్టు చెప్పుకొచ్చారు. మానవతా దృక్పథంతోనే అలా ట్వీట్ చేసినట్టు పేర్కొన్న ఆయన వైద్య సాయం అందించాలంటూ చేసిన ట్వీట్‌ను తొలగించారు.