కొవిడ్‌ టీకా పంపిణీకి సాఫ్ట్‌వేర్‌ తిప్పలు!   ఏజెన్సీల్లో  ఇంటర్ నెట్ సమస్యలు 

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన వెంటనే టీకా పంపిణి చేసేలా రాష్ట్రాలు సర్వం సిద్దం చేసుకుంటున్నాయి. కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి రెండు సార్లు డ్రై రన్ కూడా నిర్వహించారు. అయితే కోవిడ్ టీకా పంపిణికి కొన్ని సాఫ్ట్ వేర్ సమస్యలు వస్తున్నాయని డ్రై రన్ లో అధికారులు గుర్తించారు. తెలంగాణలో 1200 కేంద్రాల్లో టీకా పంపిణీకి సంబంధించిన డ్రై రన్‌ను నిర్వహించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించినా.. సాఫ్ట్‌వేర్‌ సహకరించని  కారణంగా  917 చోట్ల మాత్రమే నిర్వహించారు. ఏపీలోనూ పలు ప్రాంతాల్లో సాఫ్ట్ వేర్ సమస్యలతో డ్రైరన్ సాఫీగా జరగలేదు. కొవిన్‌ వెబ్‌ యాప్‌లో లబ్ధిదారుడి పేరు, వయసు, ఫోన్‌ నంబరు, చిరునామాతో పాటు తప్పనిసరిగా పిన్‌కోడ్‌ను కూడా చేర్చాలి. పిన్‌కోడ్‌  లేకపోతే కొవిన్‌ వెబ్‌ యాప్‌లో లబ్ధిదారుడి సమాచారం చేరదు. ఒక పిన్‌కోడ్‌ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో రెండు, మూజు  కొవిడ్‌ టీకా పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వచ్చినప్పుడు.. లబ్ధిదారుడికి సమీప కేంద్రంలో కాకుండా మరో కేంద్రంలోకి టీకా పంపిణీ ప్రదేశాన్ని సాఫ్ట్‌వేర్‌ కేటాయిస్తోంది. 

 తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ఈ సమస్య ఎక్కువగా తలెత్తుతోంది. ఒక పిన్‌కోడ్‌ పరిధిలోని ప్రాంతాలు కొన్ని చోట్ల  వేర్వేరు జిల్లాల్లోనూ ఉండటంతో అధికారులకు కూడా ఇబ్బందిగా మారుతోంది. లబ్ధిదారుడు కోరుకున్న టీకా కేంద్రం మారడంతో పాటు కొన్నిసార్లు జిల్లా కూడా మారుతోంది.  ఇక దేశమంతటా ఒకేసారి డ్రై రన్‌ను నిర్వహించడం వల్ల కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ స్లోగా పని చేసిందని డ్రై రన్‌లో గుర్తించారు. దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ ఏక కాలంలో జరుగుతుంది కాబట్టి ఆ సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఏజెన్సీతో పాటు మారుమూల ప్రాంతాల్లో ఇంటర్ నెట్ సరిగా రావడం లేదు. దీంతో  కొవిన్ వెబ్ యాప్  అందుబాటులోకి రాకపోవడంతో అక్కడ టీకా పంపిణి సాధ్యం కావడం లేదు.  ఈ సమస్యలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని,  డ్రై రన్‌లో గుర్తించిన సమస్యలను   రెండు రోజుల్లో పరిష్కరిస్తామంటున్నారు అధికారులు. 

కోవిడ్ వ్యాక్సిన్ పంపిణికి సంబంధించి కేంద్ర ఆరోగ్యశాఖ  అన్ని జిల్లాల వైద్యాధికారులకు తాజాగా మరిన్ని మార్గదర్శకాలు జారీచేసింది.  టీకాల పంపిణీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేసింది. కొవిడ్‌ టీకా ఎంతో సురక్షితమైనదని, అర్హులంతా తప్పక తీసుకోవాలని ఆరోగ్యశాఖ సూచించింది. సైడ్‌ ఎఫెక్ట్స్‌ పర్యవేక్షణకు ప్రతి టీకా పంపిణీ కేంద్రంలోను నోడల్‌ అధికారిని నియమించింది. దుష్ఫలితాలు తలెత్తితే సత్వర చికిత్సకు 14 రకాల మందులు, వస్తువులతో కూడిన కిట్‌ను అందుబాటులో ఉంచనుంది.  సాధారణ, కొద్దిగా తీవ్రమైన దుష్ఫలితాలకు అక్కడికక్కడే చికిత్స అందించేలా వైద్యులు, నర్సులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. పరిస్థితి విషమిస్తున్నట్లు భావిస్తే.. వెంటనే సమీపంలోని పెద్దాసుపత్రికి తరలించేందుకు అంబులెన్సులను సిద్ధంగా ఉంచనున్నారు.  ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రానికి అనుసంధానంగా ఇప్పటికే కొన్ని మెడికల్ కాలేజీలను, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను సర్కారు ఎంపిక చేసింది.  

ఒక్కొక్కరికి ఒక డోసులో 0.5 మి.లీ. వంతున కొవిడ్‌ టీకాను అందజేయనున్నారు. ప్రతి లబ్ధిదారుడికి ఈ టీకాను 28 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఇస్తారు. అంటే మొదటి డోసు తీసుకున్న నాలుగు వారాలకు అదే టీకాను అంతే డోసులో రెండోసారీ తప్పక తీసుకోవాల్సి ఉంటుంది.  కొవిడ్‌ టీకాను ఇంజక్షన్‌ ద్వారా అందజేస్తారు. ముందుగా వైద్యసిబ్బందికి 2 వారాల పాటు, తర్వాత పోలీసు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బందికి ఇవ్వాలని నిర్ణయించింది. కోవిడ్ వ్యాక్సిన్‌ను 2-8 డిగ్రీల ఉష్ణోగ్రతలో, అత్యంత శుభ్రమైన, సురక్షితమైన ప్రదేశాల్లోనే భద్రపర్చాలని, ఎండలో ఉంచనేవద్దని  వైద్యఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.