దిగి వచ్చిన కేంద్రం.. దహిపై వెనుకడుగు

కేంద్రం, రాష్ట్రాల మధ్య 'పెరుగు'పై నెలకొన్న వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న కర్నాటక రాష్ర్టం నుంచి వ్యక్తమైన తీవ్ర వ్యతిరేకత కారణంగా కేంద్రంలోని మోడీ సర్కార్ దిగి వచ్చింది. పెరుగుకు హిందీ పదం 'దహీ'కి బదులుగా 'కర్డ్' అని వాడుకోవచ్చని కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ అనుమతి ఇచ్చింది.  రాష్ట్రాల నుంచి 'దహీ' అన్న పేరుకు తీవ్ర వ్యతిరేకత రావడంతో  కేంద్రం దిగిరాక తప్పలేదు.

 కర్ణాటక, తమిళనాడుల్లోని పాల సహకార సంఘాలు, ప్రైవేటు డైరీలు 'కర్డ్' కు బదులుగా 'దహీ' అని వాడాలని, బ్రాకెట్లలో ఆయా స్థానిక భాషల్లో వాడే పదాలను ఉంచాలని ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ ఈ నెల10న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అంటే పెరుగు ప్యాకెట్లపై 'దహీ ' (కర్డ్-ఇంగ్లిష్), దహీ (మోసారు-కన్నడ), దహీ (తాయిర్-తమిళం), దహీ (పెరుగు-తెలుగు) అని వాడాలని సదరు సంస్థ ఆ ఆదేశాల్లో పేర్కొంది. అయితే ఇది బలవంతంగా హిందీని రుద్దడమే అని   కర్ణాటక, తమిళనాడుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది.

తమిళనాడు 'నహీ టు దహీ' అనే నినా దాన్ని ముందుకు తెచ్చింది. పెరుగు ప్యాకెట్లపై 'దహీ' అనే పదం వాడేది లేదని తమిళనాడు ప్రభుత్వ పాల సరఫరాదారు  ఎవిన్ స్పష్టం చేసింది.  ముఖ్య మంత్రి స్టాలిన్ కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. హిందీ పదాన్ని వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. ఆశ్చర్యకర విషయం ఏమంటే.. తమిళనాడు భాజపా శాఖ కూడా 'దహీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తమ పార్టీ హై కమాండ్ ను కోరింది.  డీఎంకే నేతలూ 'దహీ'' సహీ పోడా' పేరుతో సామాజిక మాధ్యమాల్లో హిందీ వ్యతిరేక ప్రచారాన్ని ప్రారంభించారు.
ఇక.. కర్ణాటకలో కూడా దహీకి నహీ అంటూ తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమార స్వామి 'దహీ' పదంపై మండిపడ్డారు. కన్నడిగులపై 'హిందీ'ని రుద్దడానికి ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన పలు పాల ఉత్పత్తిదారుల సంఘాలూ కేంద్రానికి లేఖలు రాశాయి. సంస్థ నిర్ణ యాన్ని ఉపసంహరించుకోవాలని కోరాయి.

దీంతో ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ దిగి రాక తప్పలేదు.. 'దహీ'కి బదులుగా 'కర్డ్'ను, బ్రాకెట్లలో స్థానిక భాషలను వాడవచ్చని గురువారం ఆదేశాలను సవరించింది. తాజా సవరణ ప్రకారం.. కర్డ్ (దహీ-హిందీ), కర్డ్ (మోసారు-కన్నడ), కర్డ్ (తాయిర్-తమిళం), కర్డ్ (పెరుగు-తెలుగు) పదాలను వాడవచ్చని సూచించింది. పలు వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.