హైదరాబాద్ మెట్రో-2కు కేంద్రం మోకాలడ్డు

హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. రెండో దశ మెట్రో రైలు ప్రస్తుత తరుణంలో సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది.  దీనిపై మంత్రి కేటీఆర్   కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి రాసిన లేఖలో  అనేక సార్లు కేంద్ర ప్రభుత్వ పట్టణ అభివృద్ధి శాఖకు మెట్రో రైలు రెండో దశకు అవసరమైన అన్ని రకాల సమాచారాన్ని అందించడంతో పాటు ప్రాజెక్ట్ సవివర నివేదిక సైతం పంపించామని పేర్కొన్నారు.

మరోసారి కూడా సమగ్ర సమాచారాన్ని, పూర్తి వివరాలు, పత్రాలు, నివేదికలను కేంద్రానికి  పంపుతున్నట్లు  చెబుతూ,   అత్యంత రద్దీ కలిగిన నగరమైన హైదరాబాద్ కు మెట్రో రైలు ప్రాజెక్ట్ రెండో దశ కష్టమని కేంద్రంచెప్పడం సబబు కాదన్నారు. కేంద్రం పక్షపాత ధోరణితో మెట్రో రైలు ప్రాజెక్టులు ఇస్తోందని ఆ లేఖలో ఆరోపించారు. గాంధీనగర్, కొచ్చి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో పాటు చాలా తక్కువ జనాభా ఉన్న లక్నో, ఆగ్రా,  వారణాసి, కాన్పూర్, ప్రయాగ్ రాజ్, మీరట్ వంటి   చిన్న పట్టణాలకు కూడా మెట్రో ప్రాజెక్టులను కేటాయించి వాటికి అన్ని అర్హతలూ ఉన్నాయని చెబుతూ,   హైదరాబాద్ కు మెట్రో రైలు విస్తరణ అర్హత లేదనడం దుర్మార్గమని కేటీఆర్ ఆ లేఖలో విమర్శించారు.

హైదరాబాద్ లో ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువ అని కేంద్రం చెప్పడం అర్థరహితమని విమర్శించారు.  తెలంగాణ నేడు శరవేగంతో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. తెలంగాణకు అన్ని అర్హతలు, అనుకూలతలు ఉన్నా వివిధ రంగాలలోని ప్రాజెక్టులు, కేటాయింపుల విషయంలో కేంద్ర ప్రభుత్వం చూపుతున్న వివక్షను అనేక సార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి సీఎం కేసీఆర్, తాను తీసుకెళ్లినట్టు మంత్రి కేటీఆర్ ఆ లేఖలో వివరించారు.

సంబంధిత కేంద్ర మంత్రికి వ్యక్తిగతంగా కలిసి హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ ప్రాధాన్యాన్ని వివరించేందుకు అనేక సార్లు ప్రయత్నించినా ఆయన కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఇప్పటికైనా హైదరాబాద్ నగర మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ఆమోదముద్ర వేస్తుందని ఆశి స్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.