' CCL 2016 ' విన్నర్స్ తెలుగు వారియర్స్
posted on Feb 14, 2016 5:57PM

ఉప్పల్ లో కర్నాటక బుల్ డోజర్స్ తో జరుగుతున్న సిసిఎల్ ఫైనల్ మ్యాచ్ లో తెలుగువారియర్స్ అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టి రెండో సారి సిసిఎల్ ట్రోఫీని దక్కించుకుంది.మొదట బ్యాటింగ్ చేసిన కర్నాటక బుల్ డోజర్స్ 20 ఓవర్లలో 208 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని తెలుగువారియర్స్ ముందు పెట్టింది. ఏమాత్రం బెదురు లేకుండా మొదలైన తెలుగువారియర్స్ ఇన్నింగ్స్ లో సచిన్ జోషి సెంచరీతో కదం తొక్కాడు. 49 బంతుల్లోనే 114 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.
మొదటి వికెట్ కు ప్రిన్స్ తో కలిసి రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇదే తెలుగువారియర్స్ విజయానికి బాటలు పరిచింది. సచిన్ అవుటైన తర్వాత తెలుగువారియర్స్ జోరు కొనసాగింది. వన్ డౌన్ లో వచ్చిన అఖిల్ రెండు భారీ సిక్సర్లతో విజయానికి మరింత చేరువ చేశాడు. కర్నాటక బౌలర్స్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోవడంతో, తెలుగువారియర్స్ మరో 14 బంతులు మిగిలుండగానే 9 వికెట్ల తేడాతో గెలిచింది..వెంకటేష్, నాగార్జున బంతి బంతికీ ఎంకరేజ్ మెంట్ ఇవ్వడం విశేషం..ప్రిన్స్ 43 బంతుల్లో 61 పరుగులతో, అఖిల్ 14 బంతుల్లో 25 పరుగులతో నాటౌట్ గా నిలిచారు..