నారా లోకేష్ పై క్రిమినల్ కేసు 

మూడు కేసులు... ఆరు అరెస్టులుగా సాగుతోంది ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరు. కరోనా కల్లోలంలోనూ టీడీపీ నేతలపై కేసులు ఆగడం లేదు. వైరస్ తో పోటీ పడుతున్నట్లుగా టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో టీడీపీ ముఖ్య నేతలను వివిధ కేసుల్లో అరెస్టులు చేస్తూ వస్తున్నారు పోలీసులు. తాజాగా శుక్రవారమే కర్నూల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై కేసు నమోదైంది. కరోనా నేపథ్యంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ  చంద్రబాబుపై  జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు పెట్టారు. 

చంద్రబాబుపై కేసు నమోదు చేసిన కొన్ని గంటల్లోనే టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైనా క్రిమినల్ కేసు నమోదైంది. లోకేష్ పై అనంతపురం జిల్లా డి .హిరేహాళ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్.111/2021 అండర్ సెక్షన్ ఐ.పి.సి 153(A),505 and 506 గా కేసు నమోదు చేశారు పోలీసులు.
కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఘటనకు సంబంధించి లోకేష్ పై కేసు పెట్టారని తెలుస్తోంది. 

ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డిని నిందిస్తూ,వార్నింగ్ లు ఇస్తూ ట్విట్టర్ మరియు ఇతర సామాజిక మాధ్యమాలలో పోస్ట్ లు పెట్టారట. ఆ పోస్టులకు సంబంధించి కాపు రామచంద్రారెడ్డి  గౌరవానికి భంగం కలిగించారని పోలీసులకు  ఫిర్యాదు అందిందని చెబుతున్నారు. కాపు రామచంద్రారెడ్డి పై  ప్రజలలో వ్యతిరేకత ద్వేషం కలిగిస్తూ , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్ట పరచడానికి కుట్రపన్నినట్లు ఫిర్యాదు చేయడంతో.. అందుకు బాధ్యులుగా నారా లోకేష్ పై కేసు నమోదు చేశారని సమాచారం. అనంతపురం జిల్లాలో లోకేష్ పై కేసు నమోదు కావడం దుమారం రేపుతోంది. సోషల్ మీడియా పోస్టులతో ఎలాంటి సంబంధం లేకున్నా... అనవసరంగా  రాజకీయ దురుద్ధేశంతో లోకేష్ పై కేసు పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.