కొత్త పార్టీ యోచనలో కెప్టెన్? పంజాబ్ కాంగ్రెస్ లో పరేషాన్..

వచ్చే ఏడాది దేశంలో కీలక ఎన్నికలు జరగబోతున్నాయి. యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికల ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందని అంటున్నారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ పోల్స్ సెమీ ఫైనల్స్ అన్నట్లు. అందుకే అన్ని పార్టీలు ఈ ఎన్నికల కోసం శ్రమిస్తున్నాయి. ఎన్నికలు జరగబోతున్న ఐదు రాష్ట్రాల్లో పంజాబ్ ఒక్కటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాలో బీజేపీ అధికారంలో ఉంది. 

వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఆశ ఉంది కూడా ఒక్క పంజాబ్ రాష్ట్రంపైనే. మిగితా రాష్ట్రాల్లో ఆ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అయితే ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ లో కూడా సంక్షోభం ముదురుతోంది. ఇటీవల పంజాబ్ ముఖ్యమంత్రిని మార్చేసింది కాంగ్రెస్ హైకమాండ్. కెప్టెన్ అమరీందర్ సింగ్ ను తప్పించి  చరణ్‌జిత్ సింగ్ చన్నీని నియమించింది. చన్నీ పీసీసీ చీఫ్ నవజ్యోతిసింగ్ సిద్దూ మనిషి. తనను తొలగిస్తూ హైకమాండ్ తీసుకున్న నిర్ణయంపై అమరీందర్ సింగ్ భగ్గుమంటున్నారని తెలుస్తోంది. ప్రతీకారం కోసం ఆయన చూస్తున్నారని తెలుస్తోంది. సొంత పార్టీ నాయ‌కుల‌పై ఆయన  బ‌హ‌రంగంగానే ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం దుమారం రేపుతోంది.

రాజ‌కీయ కురవృద్ధుడుగా పేరున్న అమ‌రీంద‌ర్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేశాక ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారోన‌నే ఆస‌క్తి నెల‌కొంది. ఆయ‌న ముఖ్య‌మంత్రి గ‌ద్దె దిగారు కానీ కాంగ్రెస్ పార్టీని వీడే విష‌యంలో మాత్రం ఎలాంటి కామెంట్లు చేయ‌లేదు. దీంతో ఆయ‌న ఆ పార్టీలోనే కొన‌సాగడం ఖాయ‌మ‌నే అభిప్రాయాలు ఏర్ప‌డ్డాయి. కానీ ప్ర‌త్య‌ర్థి వ‌ర్గం కుట్రల వ‌ల్ల అవ‌మానానికి గురై సీఎం ప‌ద‌వి వదులుకున్న ఆయ‌న‌.. సొంత పార్టీ నాయ‌కుల‌పై ఇప్పుడు ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రించే సిద్ధూను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పంజాబ్ ముఖ్య‌మంత్రి కాకుండా అడ్డుకుంటాన‌ని గ‌తంలో ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. తాజాగా అందుకోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధ‌మ‌ని కుండ బ‌ద్ధ‌లు కొట్టారు. 

సిద్ధూ దేశానికి ప్ర‌మాద‌కారి అని అమ‌రీంద‌ర్ సింగ్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వ‌చ్చే ఏడాది పంజాబ్ శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో సిద్ధూ ఓట‌మికి కృషి చేస్తాన‌ని ఆయ‌న ప‌రోక్షంగా వ్యాఖ్యానించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో సిద్ధూపై బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెడ‌తాన‌ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆయ‌న ముఖ్య‌మంత్రి కాకుండా పోరాడ‌తాన‌ని అమ‌రీంద‌ర్ చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ అగ్ర‌నేత‌లైన రాహుల్ గాంధీ, ప్రియాంక‌ల‌ను అనుభ‌వం లేని నాయ‌కులుగా అమ‌రీంద‌ర్ పేర్కొన‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ నేప‌థ్యంలో అమ‌రీంద‌ర్ కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతున్నారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. లేక‌పోతే ఒకే పార్టీలో ఉండే అమ‌రీంద‌ర్‌.. సిద్ధూపై బ‌ల‌మైన అభ్య‌ర్థిని నిల‌బెడ‌తాన‌ని ప్ర‌క‌టించ‌డం ఏమిట‌నే? చ‌ర్చ జోరందుకుంది. అమ‌రీంద‌ర్ పార్టీ వీడ‌బోతున్నార‌ని.. అందుకే కాంగ్రెస్ నాయ‌కుల‌పై ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కేంద్రమంత్రి రాందాస్ అథవాలే ఎన్డీఏలోకి అమరీందర్ సింగ్ ను ఆహ్వానిస్తూ ప్రకటన చేశారు. ఆ ప్రకటనపై స్పందించ లేదు కెప్టెన్. తాజాగా కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేలా అమరీందర్ సింగ్ కామెంట్లు చేయడంతో ఆయన ఆ పార్టీని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నారని ఖాయంగా తెలుస్తోంది. అయితే అమరీందర్ బీజేపీ కూటమికి సపోర్ట్ చేస్తారా లేక కొత్త పార్టీ పెట్టుకుంటారా అన్నది తెలియడం లేదు. అమరీందర్ సింగ్ బీజేపీలో చేరబోరని.. కొత్త పార్టీ పెడతారనే చర్చే ఎక్కువగా సాగుతోంది. ప్రస్తుతం రైతులు బీజేపీపై తీవ్ర కోపంగా ఉన్నారు. కాబట్టి బీజేపీలో చేరే అవకాశాలు ఉండవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఎన్నికల తర్వాత పొత్తుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు.