బీజేపీ కూటమిలోకి అమరీందర్ సింగ్? పంజాబ్ సీఎంగా చన్నీ..

పంజాబ్ రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ తో విభేదించిన కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేయడంతో.. పార్టీల వ్యూహాలు శరవేగంగా మారిపోతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయేలోకి రావాలంటూ కేంద్ర మంత్రి, ఆర్‌పీఐ (ఏ) అధినేత రాందాస్ అథవాలె ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అమరీందర్‌ను అవమానించిందని, అలాంటి పార్టీలో ఉండాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ఎన్డీయేలో ప్రతి ఒక్కరికి సమాన గౌరవం ఉంటుందని, అమరీందర్ ఎన్డీయేలోకి వస్తే వచ్చే పంజాబ్ ఎన్నికల్లో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని అథవాలె అన్నారు. 

సిద్ధూ విషయంలో అమరీందర్ వైఖరి సరైందేనన్నారు అథవాలె.  సిద్దూ పాకిస్తాన్ వెళ్లి బజ్వాను కౌగిళించుకోవడం చాలా తీవ్రమైన పరిణామమన్నారు. అమరీందర్ చెప్పింది కరెక్టే.. సిద్ధూ మోసగాడు అని అథవాలె అన్నారు. అమరీందర్ సింగ్ ను ఎన్డీయే కూటమికి లోకి ఆహ్వానిస్తూ అథవాలే చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. కెప్టెన్ కూడా అదే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. బీజేపీలో చేరకుండా సొంత పార్టీ పెట్టి.. ఎన్డీఏ కూటమికి అమరీందర్ సింగ్ మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇక పంజాబ్‌కు కాబోయే ముఖ్యమంత్రిని ప్రకటించింది కాంగ్రెస్. పంజాబ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ అని   పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ హరీష్ రావత్ ప్రకటించారు. 
పంజాబ్ అసెంబ్లీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. పంజాబ్‌కు కాబోయే ముఖ్యమంత్రులు వీరేనంటూ సుక్జిందర్ సింగ్ రంధావా సహా మరికొన్ని పేర్లు వినిపించాయి. అందులో చన్నీ పేరు లేదు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ చరణ్‌జిత్ సింగ్ చన్నీ పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.

హిందూ నేతను ఎంపిక చేయాల్సి వస్తే రాజ్యసభ సభ్యురాలు అంబికా సోని పేరు ప్రతిపాదించే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే సిక్కు నేతకే సీఎం పగ్గాలు ఇవ్వాలని అంబికా సోని అధిష్టానానికి చెప్పినట్టు తెలుస్తోంది. నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరు అంతగా ప్రచారంలోకి రాకపోయినా, ఆయనను కానీ, ఆయన అనుయాయులను కానీ సీఎంగా ప్రకటిస్తే అసెంబ్లీలో బలపరీక్షకు కెప్టెన్ అమరీందర్ డిమాండ్ చేసే అవకాశాలను కూడా అధిష్ఠానం పరిశీలనలోకి తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చరణ్‌జిత్ సింగ్ చన్నీ వైపుకు అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం.