బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా

బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడటంతో ప్రధాని బోరిస్ జాన్సన్ రాజీనామా చేశారు. ప్రధాని బోరిస్ రాజీనామా డిమాండ్ తో ఆయన మంత్రివర్గంలోని 15 మంది మంత్రులు రాజీనామా చేయడంతో పదవిని పట్టుకు వేళాడడానికి బోరిస్ చేసిన ప్రయత్నాలు  విఫలమయ్యాయి.

  బోరిస్ ప్రభుత్వం అవినీతి ఆరోపణల్లో చిక్కుకోవడంతో  తొలుత ఈ నెల 5న ఆర్థిక మంత్రి రుషి సూనక్, ఆర్థిక శాఖ కార్యదర్శి సాజిద్ జావిద్ రాజీనామా చేశారు. వారితో మొదలైన మంత్రుల రాజీనామాల పర్వం చివరిగా రాజీనామా చేసిన 15 మందితో కలిసి మొత్తంగా ప్రభుత్వం నుంచి వీడిన వారి సంఖ్య 40కి చేరుకుంది. వీరందరి డిమాండ్ ప్రధానిగా బోరిస్ వైదొలగడమే కావడంతో ముందర ‘తగ్గేదే’ లేదంటూ ధీమా ప్రదర్శించిన బోరిస్ చివరికి రాజీనామా చేయక తప్పలేదు. నేర చరిత్ర ఉన్న క్రిస్ పించర్ ను కీలక పదవిలో బోరిస్ నియమించడంతో వివాదం ఆరంభమై చివరికి ప్రధాని పదవి నుంచి బోరిస్ వైదొలిగే వరకూ వచ్చింది.

గతంలో ఒక సారి విశ్వాస పరీక్ష ను గట్టెక్కిన బోరిస్ ఈ సారి మాత్రం వ్యతిరేకతకు తలొగ్గి రాజీనామా చేయక తప్పలేదు. దాదాపు నెల రోజుల కిందట జరిగిన పార్లమెంటరీ స్థానాల ఉప ఎన్నికలలో అధికార కన్జర్వేటరీ అభ్యర్థులు పరాజయం పాలైనప్పుడే బోరిస్ సర్కార్ మునిగిపోయే నావగా పరిశీలకులు అభివర్ణించారు. వారి విశ్లేషణలు సరైనవేనని గురువారం (జూలై 7) ప్రధాని పదవికి బోరిస్ రాజీనామా చేయడంతో రుజువైంది.

రాజీనామా చేసిన బోరిస్ మాట్లాడుతూ తదుపరి ప్రభుత్వం ఏర్పడే వరకూ ఆపద్ధర్మ ప్రధానిగా కోనసాగుతానని చెప్పారు. అక్టోబర్ నాటికి నూతన ప్రధాని ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.  నూతన ప్రదానిగా బోరిస్ కు వ్యతిరేకంగా తొలుత రాజీనామా చేసిన భారత సంతతికి చెందిన రుషి సూనక్ ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

దాదాపుగా మూడేళ్లు బ్రిటీష్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన బోరిస్ రాజీనామా అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యుత్తమ పదవిని వీడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రధానిగా తన విజయాల పట్ల గర్వంగా ఉందనీ, అదే సమయంలో ప్రధానిగా తన వైఫల్యాల పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాననీ పేర్కొన్నారు. సహచర కన్జర్వేటివ్ ఎంపీలు, మంత్రివర్గ సహచరుల నిర్ణయాన్ని శిరసావహిస్తూ రాజీనామా చేసినట్లు చెప్పారు.