వైసీపీలో బొత్స ముసలం



కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో సర్వనాశనం అయిపోవడానికి గల ప్రధాన కారణాల్లో రాష్ట్ర విభజనతోపాటు, ఆ పార్టీ నాయకుల అవినీతి, ఆ పార్టీకి నాయకత్వం వహించిన బొత్స సత్యనారాయణ కూడా ఒక కారణం అని కాంగ్రెస్ కార్యకర్తలే అంటూ వుంటారు. బొత్స సత్యనారాయణ తన శల్య సారథ్యంతో కాంగ్రెస్ పార్టీని సమాధి చేశారన్న అభిప్రాయం బలంగా వుంది. బొత్స చేసిన అవినీతి, అక్రమాలు కూడా కాంగ్రెస్ పార్టీ కన్నుమూయడానికి తమవంతు సహకారాన్ని అందించాయని చెబుతూ వుంటారు. బొత్స ధాటికి తట్టుకోలేక ఎన్నికల ముందే చాలామంది కాంగ్రెస్ పార్టీ నుంచి వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి బలంగా వున్న అనేకమంది నాయకులు బొత్స పుణ్యమా అని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాంటి వారిలో బొబ్బిలి రాజ కుటుంబానికి చెందిన సుజయకృష్ణ రంగారావు, బేబి నాయన కూడా వున్నారు. రంగారావు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవగా, బేబి నాయన ఎంపీగా పోటీ చేసి  అశోక్ గజపతిరాజు చేతిలో ఓడిపోయారు. గెలిచినా, ఓడినా ఈ ఇద్దరు అన్నదమ్ములు ఉత్తరాంధ్ర వైసీపీలో బలమైన నాయకులుగా వున్నారు. ఇప్పుడు వీరిద్దరిని దూరం చేసుకునే రాంగ్ స్టెప్ వైసీపీ వేయబోతోంది. ఆ స్టెప్పే బొత్స సత్యనారాయణను పార్టీలోకి తీసుకోవడం.

బొత్స సత్యనారాయణ టీడీపీలో, బీజేపీలో చేయడానికి ప్రయత్నించి విఫలమయ్యాక ఇప్పుడు ఆయన దృష్టి వైసీపీ మీద పడింది. వైఎస్సార్ మరణించిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి కాకుండా వుండటానికి తనవంతు కృషి చేసిన బొత్స ఇప్పుడు వైసీపీ గుమ్మం ముందు నిల్చోవడాన్ని చూసి ఎవరూ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, రాజకీయాల్లో ఇది మామూలే. వైసీపీ నాయకత్వం కూడా బొత్సను పార్టీలో తీసుకోవాలనే ఆసక్తి కనిపిస్తోంది. ఈనెల 30వ తేదీన హైదరాబాద్‌లో వైసీపీ కీలక నాయకులు విజయ సాయి రెడ్డి, సజ్జా రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఒక సమావేశం జరగబోతోందట. ఆ సమావేశంలో బొత్స పార్టీ ప్రవేశానికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం వున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కీలక నిర్ణయం అంటే బొత్సను పార్టీలోకి తీసుకునే నిర్ణయమే అయి వుంటుందని వారు చెబుతున్నారు. హైదరాబాద్‌లో కూర్చున్న పార్టీ ఆలోచనా విధానం ఇలా వుంటే, ఉత్తరాంధ్ర జిల్లాలోని వైసీపీ కార్యకర్తలు, నాయకులలో మాత్రం బొత్స రాక చాలా సీరియస్ మేటర్ అయి కూర్చుంది.

గతంలో కాంగ్రెస్ పార్టీలో వున్న సుజయ కృష్ణ రంగారావు, బేబి నాయన బొత్సతో వేగలేకే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై కొట్టి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. బొత్సకు రాజకీయ గురువు అయిన పెన్మత్స సాంబశివరాజు కూడా కాంగ్రెస్ టాటా చెప్పేసి వైసీపీకి వచ్చేశారు. ఇప్పుడు కనుక బొత్సను పార్టీలో చేర్చుకున్నట్టయితే ఈ ముగ్గురూ వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమని ఉత్తరాంధ్ర వైసీపీ వర్గాలు అంటున్నాయి. వైసీపీ నాయకత్వం ఇప్పటికైనా బొత్సను పార్టీలోకి తీసుకునే ఆలోచనను మానుకోవాలని వీరు అంటున్నారు. బొత్స కనుక పార్టీలోకి వస్తే ఉత్తరాంధ్రలో వైసీపీ సమాధి కావడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. బొత్స కావాలో, తాము కావాలో తేల్చుకోవాల్సిన తరుణం ఇదని వారు అంటున్నారు. ఉత్తరాంధ్ర వైసీపీలో బొత్స విషయంలో ఇంత నెగటివ్ వున్నప్పటికీ పార్టీ నాయకత్వం బొత్స వైపే మొగ్గు చూపుతూ వుందంటే ఏమని అర్థం చేసుకోవాలి... పార్టీకి అంతిమ ఘడియలు సమీపించాయని అర్థం చేసుకోవాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.