బొత్స ప‌వ‌న్ జ‌పం‌.. వైసీపీలో టెన్ష‌న్‌?

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ రూట్ మార్చారా..?  వైసీపీలో ఉంటే రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని  భావిస్తున్నారా..? వెంటనే కాకపోయినా కొంత కాలం తరువాతైనా  జ‌న‌సేన గూటికి చేరే దిశగా బొత్స వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారా.. అంటే రాజకీయవర్గాల నుంచే కాకుండా వైసీపీ వర్గాల నుంచీ అవున‌నే సమాధానమే వస్తోంది. గ‌తంలోనూ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ వైసీపీని వీడుతార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత బొత్స స‌త్య‌నారాయాణ కొద్ది కాలం పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో అత‌ను జ‌న‌సేన పార్టీలో చేరతార‌ని ప్ర‌చారం జ‌రిగింది. జ‌న‌సేన పార్టీకి చెందిన ముఖ్య‌ నేత‌లు కొంద‌రు బొత్స ను క‌లిసి పార్టీలోకి  ఆహ్వానించార‌న్న వార్త‌లూ వ‌చ్చాయి.

ఆ స‌మ‌యంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు రావ‌డంతో వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అల‌ర్ట్ అయ్యారు. ఉమ్మడి విశాఖపట్టణం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ప్ర‌క‌టించారు. తెలుగుదేశం కూటమి నుంచి ఎవరూ పోటీ చేయకపోవడంతో ఆయన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్ప‌ట్లో .. విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తికి విశాఖపట్టణం నుంచి ఎమ్మెల్సీ ఇవ్వడంపై వైసీపీలో కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ బొత్సకే జ‌గ‌న్ ప్రాధాన్యత  ఇచ్చారు. త‌ద్వారా వైసీపీని వీడ‌కుండా బొత్స‌కు జ‌గ‌న్ అడ్డుక‌ట్ట వేశార‌న్న ప్ర‌చారం అప్పట్లో గట్టిగా జ‌రిగింది.

ఎమ్మెల్సీగా ఎన్నిక‌యిన త‌రువాత బొత్స స‌త్య‌నారాయ‌ణ వైసీపీలో కీల‌క భూమిక పోషిస్తున్నారు. మండ‌లిలో విప‌క్ష నేత‌గా కూట‌మి ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌పై మంత్రుల‌ను నిల‌దీస్తున్నారు. వైసీపీ త‌ర‌పున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజ‌రు కావ‌డంతో.. శాస‌న మండ‌లిలోనే ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాల‌ని వైసీపీ నిర్ణ‌యించింది. దీంతో విప‌క్ష నేత‌గా మండ‌లిలో వైసీపీ వాయిస్ను బొత్స బ‌లంగానే వినిపిస్తున్నారు. అయితే, వైసీపీలో అంత‌ర్గ‌తంగా జ‌రుగు తున్న ప‌రిణామాల‌తో బొత్స అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలుస్తోంది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకుంటున్న ప‌లు నిర్ణ‌యాలను ఆయ‌న త‌ప్పుబ‌డుతున్నారని, అయినా జ‌గ‌న్ బొత్స‌ సూచ‌న‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవ‌టం లేద‌న్న ప్ర‌చారం వైసీపీ వ‌ర్గాల్లో జ‌రుగుతున్నది. ప్ర‌ధానంగా అసెంబ్లీ స‌మావేశాల‌కు జ‌గ‌న్ స‌హా వైసీపీ ఎమ్మెల్యేలు హాజ‌రు కావాల‌ని బొత్స సూచించార‌ని స‌మాచారం. అసెంబ్లీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప్ర‌శ్నించాల‌ని త‌ద్వారా ప్ర‌జ‌ల్లోకి మంచి మెస్సేజ్ వెళ్తుంద‌ని, అసెంబ్లీకి వెళ్ల‌కుండా ఉండ‌టం ద్వారా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై వైసీపీ ప‌ట్ట‌డంలేద‌న్న భావ‌న క‌లుగు తుంద‌ని జ‌గ‌న్ దృష్టికి బొత్స తీసుకెళ్లార‌ని, కానీ, బొత్స సూచ‌న‌ను జ‌గ‌న్  ఏమాత్రం ప‌ట్టించుకోలేద‌ని వైసీపీ వ‌ర్గాల్లో గతంలో చ‌ర్చ జ‌రిగింది. 

బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉంది. ఆయ‌నకు అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్ లో మంత్రి కొన‌సాగిన బొత్స‌.. రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క భూమి పోషించారు. వైఎస్ఆర్ మ‌ర‌ణం త‌రువాత కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్య‌నేత‌ల్లో ఒక‌రిగా కొన‌సాగారు. ఉత్త‌రాంధ్ర ప్రాంతంలో ప్ర‌జాబ‌లం క‌లిగిన నేత‌గా బొత్స ఎదిగారు. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన బొత్స‌కు ఆ సామాజిక వ‌ర్గం ఓట‌ర్ల మ‌ద్ద‌తు ఎక్కువే. 2014 ఎన్నికల తరువాత వైసీపీలో చేరిన బొత్స‌కు జ‌గ‌న్ ప్రాధాన్య‌త ఇచ్చా రు. వైసీపీ ప్ర‌భుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బొత్స ప‌నిచేశారు. వైసీపీ ప్ర‌భుత్వం తీసుకున్న ప‌లు నిర్ణ‌యాల‌ ప‌ట్ల అప్ప‌ట్లో బొత్స అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా సినీ హీరోల ప‌ట్ల జ‌గ‌న్ ప్ర‌వ‌ర్త‌న‌ను బొత్స ఖండించిన‌ట్లు అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. చిరంజీవి కుటుంబంతో బొత్స‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ తోనూ బొత్సకు మంచి సంబంధాలు ఉన్నాయి. గ‌త అసెంబ్లీ స‌మావేశాల స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ద్ద‌కు వెళ్లి బొత్స ప్ర‌త్యేకంగా మాట్లాడారు. అంతే కాదు.. ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను బొత్స విమ‌ర్శించిన సంద‌ర్భాలు చాలా త‌క్కువే. దీంతో వైసీపీలోని ప‌లువురు నేత‌లు బొత్స తీరును త‌ప్పుబ‌డుతున్నారు.

జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని  వైసీపీ ఎమ్మెల్యేలంతా బాయ్ కాట్ చేస్తే.. జగన్ కు కాకపోతే కనీసం పవన్ కు అయినా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని బొత్స అన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శాసనమండలిలో కానీ.. మరో చోట కానీ పవన్ కు  వ్యతిరేకంగా బొత్స‌ మాట్లాడకపోవడం వైసీపీలోనూ చర్చనీయాంశమవుతుంది. జగన్ మోహన్ రెడ్డి  తన పార్టీ నేతలంతా పవన్ ను దూషించాలని  కోరుకుంటారు. కానీ, బొత్స మాత్రం మా మంచి పవన్ అంటుండటంతో ఆయన చూపు జనసేన వైపు ఉందన్న భావన వైసీపీ వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది.  బొత్స స‌త్య‌నారాయ‌ణ రాజ‌కీయంగా ఢక్కామొక్కీలు తిన్న రాజకీయ నేత. సరైన సమయంలో సరైన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆయన తీరు ఉంద‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ రోజు కాకపోతే రేపైనా బొత్స జ‌న‌సేన‌సేలో చేర‌డం ఖాయ‌మ‌న్న వాద‌న వైసీపీ వ‌ర్గాల నుంచి గట్టిగా వినిపిస్తోంది.  మ‌రోవైపు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ట్ల‌ బొత్స‌ ప్రేమ‌గా ఉండ‌టానికి మ‌రో కార‌ణం కూడా ఉందంటున్నారు.  బొత్స‌కు బ‌ల‌మైన ఓటు బ్యాంకు కాపులే. ప్ర‌స్తుతం ఆ సామాజిక‌వ‌ర్గం ప్ర‌జ‌లు ఎక్కువ‌గా జ‌న‌సేన వైపే ఉన్నారు. ప‌వ‌న్ ను విమ‌ర్శిస్తే త‌న‌కు బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా ఉన్న ఆ సామాజిక వ‌ర్గం ఓటర్లు దూర‌మ‌వుతార‌న్న భావ‌న‌లో బొత్స‌ ఉన్నార‌ట‌. మొత్తానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ పై బొత్స ప్రేమ‌.. వైసీపీ వ‌ర్గాల‌ను టెన్ష‌న్ పెడుతుంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu