కమలానికి కాదేదీ అనర్హం.. కరోనా వ్యాక్సిన్ సైతం!

ఇంతకూ వ్యాక్సిన్ ఉచితమా? కాదా?

 

బీహార్ మేనిఫెస్టోతో కొత్త సందేహాలు

 

భారతీయ జనతా పార్టీ అంటే గంగానది అంత స్వచ్ఛమైనది. ఇంకా ఎక్కువ మాట్లాడితే గంగ కంటే స్వచ్ఛమైనది. దానికి రాజకీయాలు-అధికారం కంటే సిద్ధాంతం ముఖ్యం. రాజకీయ అవకాశవానికి అల్లంత దూరంలో ఉంటుంది. తుచ్ఛమైన రాజకీయ ప్రయోజనాల కోసం, అవసరార్ధ రాజకీయాలు చేయదు. వాజపాయ్ మాదిరిగా, అవసరమైతే అధికారమయినా వదులుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. అది.. అవసరార్ధ రాజకీయాలు, పూటకో మాట, రాష్ర్టానికో హామీ ఇచ్చే కాంగ్రెస్ పార్టీలా కాదు. కాంగ్రెస్ అనే రాజకీయభూతం, దేశంలో సృష్టించిన పుండాకోరు సంస్కృతిని కూకటివేళ్లతో పెకలించి, దాని భ్రష్ఠాచార-అవకాశ వాద రాజకీయాలకు.. చరమగీతం పలికేందుకు పుట్టిన పార్టీ బీజేపీ!

 

అంత పవిత్రమైన, అంత మంది పులుకడిగిన ముత్యాలున్న పార్టీ.. ఒక ఓటుతో అధికారాన్నే కాదనుకున్న పార్టీ... కేవలం ఒక్క రాష్ట్రంలో ఓట్ల కోసం అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతుందా? అసాధ్యం.. నెవ్వర్.. అసంభవ్.. కండిత ముడియాదు.. ఆగోదిల్ల.. హైలీ ఇంపాజిబిల్!!! అవును కదా?.. నిన్నటి వరకూ అంతా అలాగే ఫీలయ్యారు. కానీ కేంద్రమంత్రి నిర్మలమ్మ ప్రకటించిన, బీహార్ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టో చూసిన తర్వాత.. అవకాశవాద రాజకీయాలు, అనుచిత హామీల తీరు చదివిన తర్వాత.. రాజకీయ జేజెమ్మ కాంగ్రెస్‌కే, కమలం పువ్వు పార్టీ దగ్గులు నేర్పుతుందనిపించక మానదు.
ప్రపంచం అంతా కరోనా వైరస్‌తో గజగజలాడుతోంది. శ్వేత సౌదాధిపతి, ప్రపంచపెద్దన్న ట్రంపు నుంచి.. భారత రెండవ పౌరుడయిన మన నెల్లూరు నాయుడు గారి వరకూ, కరోనా ఎవరినీ విడిచిపెట్టలేదు. పాపం దానికి కులాలు-మతాలు-హోదాలు-పదవులతో పనిలేదు.  ప్రపంచం మీదకు చైనా వదిలిన ఆ మహమ్మారికి,  ఇప్పటికీ కోట్ల మంది బలవుతూనే ఉన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు, వ్యాక్సిన్ తయారుచేసే పనిలో పెద్ద దేశాలు బిజీగా ఉన్నాయి. మనదేశంలో కూడా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్ వస్తే తొలి విడత 25 కోట్ల మందికి ఇచ్చే విధంగా ఏర్పాటుచేస్తామని, అందులో ముందుగా కరోనా వారియర్స్, వృద్ధులు, పిల్లలకు ఇస్తామని కేంద్రం కూడా ప్రకటించింది. ఇంతవరకూ బాగానే ఉంది.

 

కానీ, తాజాగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్.. బీహార్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రకటించిన, వ్యాక్సిన్ తాయిలమే దేశ ప్రజలలో కొత్త సందేహాలు రేపింది. తమ పార్టీకి ఓటు వేసి, ఆ పీఠమేదో తమకు అప్పగిస్తే.. కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామన్నది, నిర్మలమ్మ హామీల వరదలో వినిపించిన ఓ మహాప్రసాదం. అంటే ఆ ప్రకారంగా.. కేవలం బీహార్ ప్రజలకే, అది కూడా తన్మయత్వంతో కమలం పువ్వును వికసింపచేస్తేనే, ఆ రాష్ట్ర ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ప్రసాద భాగ్యం దక్కుతుందన్నమాట! లేకపోతే లేనట్లే లెక్క. మరి ఇతర రాష్ట్ర ప్రజలకు ఆ భాగ్యం లేదా?.. అన్న ప్రశ్నకు,  బీజేపీ మోతుబరి భూపీందర్ యాదవ్ చేసిన మరికొన్ని అమృతవాక్కులు, దేశ ప్రజలను మరింత గందరగోళానికి గురిచేశాయి.

 

వ్యాక్సిన్ అనేది ఉచితం కాదని, నామమాత్రపు ధరకు లభిస్తుందని, రాష్ర్టాలే ఈ ఖర్చును భరించాలని సదరు బీజేపీ మహా మంత్రి సెలవిచ్చారు. ఆ ప్రకారంగా బీహార్‌లో తాము అధికారంలోకి వస్తేనే, వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామన్నది కమలదళాల కవిహృదయమన్న మాట. అంటే.. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను ఉచితంగా ఇస్తారేమోనని,  భ్రమిస్తూ వచ్చిన వెర్రి వెంగళప్పల కళ్లను, కమలనేత్రాలు ఆ విధంగా తెరిపించాయన్నమాట. మరి ఇన్నాళ్లూ టీవీలో నరేంద్రుల వారిచ్చిన గంభీర ఉపన్యాసాలు. కొట్టిన చప్పట్లు.. వెలిగించిన కొవ్వొత్తుల మాటేమిటి? అంతా తూచ్చేనా?

 

కేంద్రం తీరు చూస్తే అదే డౌటనుమానం వస్తోంది మరి! రాదా మరి..? ఎందుకంటే.. కరోనా సీజన్‌లో మోదీ భయ్యా చప్పట్లు కొట్టమంటే, జనం గంటలు మోగించారు. కొవ్వుత్తులు వెలిగించమంటే, ఏకంగా దివిటీలే వెలిగించారు. మరి నరేంద్ర భయ్యా చెబితే ఇంత చేసిన జనాలకు, కమలం పార్టీ ఇచ్చే బహుమతి ఇదేనా? ఇప్పుడు కమలం పార్టీ ఇచ్చే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా  కావాలంటే, మళ్లీ ఎన్నికలు రావలసిందేనా? అప్పటివరకూ వ్యాక్సినుకు తెరవు లేదా? ఎన్నికలొచ్చే వరకూ కళ్లలో వత్తులేసుకుని, దేభ్యమొహాలతో ఎదురుచూడాల్సిందేనా?

 

ప్రజారోగ్యం బాధ్యత ప్రభుత్వానిదే అయినప్పుడు, మరి ఎవరి ఖర్మకు వారిని విడిచిపెట్టడం భావ్యమా? మరోపక్క.. వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని, కేంద్ర ఆరోగ్యమంత్రి సెలవిస్తున్నారు. ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? పార్టీ నేతదా? కేంద్రమంత్రిదా? హేమిటో.. ఈ కమలం కంగాళీయం! అయినా అవకాశవాద రాజకీయాలకు ఆమడదూరం.. ఇంకా చెప్పాలంటే వేల కిలోమీటర్ల దూరం ఉంటుందనుకునే,  భారతీయ జనతా భిన్నమైన పార్టీ అనే కడిగిన ముత్యానికి.. ఈ రాజకీయ పైత్యమేమిటన్నది దేశప్రజల ప్రశ్న.

-మార్తి సుబ్రహ్మణ్యం