కొంప ముంచిన వైసీపీ లేఖలు? పోలవరానికి రూ. 15.6 వేల కోట్లే!

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు అంచనా వ్యయాన్ని అత్యంత భారీగా తగ్గించేసింది. పోలవరానికి కేంద్రం నుంచి ఇవ్వాల్సింది రూ.15,667.90 కోట్లు మాత్రమేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తేల్చేశారు. ఇందులోనూ  రూ.8,614.16 కోట్లు ఇప్పటికే మంజూరు చేశామని కేంద్రం చెబుతోంది. ఈ లెక్కన పోలవరానికి కేంద్రం ఇంకా ఇవ్వాల్సింది కేవలం రూ.7,053.74 కోట్లే. 2013, 2014 అంచనాల ప్రకారం ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.15,667.90 కోట్లకు కేంద్రం కుదించింది. కేంద్రం ఇవ్వాల్సింది రూ.7,053.74 కోట్లే అని అంగీకరిస్తేనే.. ప్రసుత్తం రూ.2,234.28 కోట్లు విడుదల చేస్తామని కేంద్రం షరతు పెట్టిందని తెలుస్తోంది. 

 

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ అంచనా వ్యయాన్ని కేంద్రం తగ్గించిన సమాచారం తెలియడం వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని రోజులుగా హైరానా పడుతున్నట్లు తెలుస్తోంది. అందు కోసమే ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వారం రోజుల వ్యవధిలోనే రెండు సార్లు ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఆర్థిక మంత్రిని నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఇవాళ కూడా నిర్మలతో సమావేశమయ్యారు బుగ్గన. అయితే పోలవరం నిధులు, సవరించిన బడ్జెట్ అంచనాల ఆమోదంపై కేంద్రం నుంచి బుగ్గనకు ఎలాంటి ఊరట లభించలేదని చెబుతున్నారు. 

 

నెల రోజుల క్రితం పోలవరం ప్రాజెక్ట్ సవరించిన బడ్జెట్ కు పోలవరం అథారిటీ ఆమోదం తెలిపిందని వార్తలు వచ్చాయి. ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు పునరావాస ప్యాకేజీ, ముంపు బాధితులకు పరిహారం కోసం అవసరమైన 56 వేల కోట్ల రూపాయలు భరించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వైసీపీ నేతలు కూడా ప్రచారం చేసుకున్నారు. జగన్ వల్లే ఇది సాధ్యమైందని, కేంద్రాన్ని ఒప్పించడంలో ఆయన సక్సెస్ అయ్యారని మంత్రులు కూడా చెప్పారు. ఇప్పడు సీన్ మారిపోవడంతో వైసీపీ నేతలు దిక్కులు చూస్తున్నారు. వైసీపీ నేతలు చెప్పినట్లు నెల రోజుల క్రితం కేంద్రం ఓకె చెబితే.. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఎందుకు ఈ ప్రకటన చేస్తారనే చర్చ వస్తోంది.ఢిల్లీ నుంచి సరైన సమాచారం లేకుండానే వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. 

 

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.56 వేల కోట్లకుపైగా అంచనాలను గతంలో టీడీపీ కేంద్రానికి పంపింది. ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. పోలవరంపై పలు ఆరోపణలు చేస్తూ కేంద్రానికి వైసీపీ లేఖలు రాసింది. పోలవరం సాగునీటి ప్రాజెక్టు సీఎం చంద్రబాబుకు ఏటీఎంగా మారిందని, అందుకే.. 2013- 14లో రూ.29,027.95 కోట్లుగా ఉన్న అంచనాలను రూ.55,548.87 కోట్లుకు పెంచేశారని ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ ఆరోపించారు. ప్రాజెక్టు అంతా అవినీతిమయమని. కమీషన్లకు కక్కుర్తిపడి అంచనా వ్యయాన్ని పెంచారని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. వైసీపీ రాసిన లేఖలు, ప్రతిపక్ష నేతగా గతంలో జగన్ చేసిన ఆరోపణలే పోలవరానికి ఇప్పుడు శాపంగా మారాయని అధికారులు అంటున్నారు. 

 

వైసీపీ అధికారంలోకి వచ్చాకా పోలవరం పనుల్లో వేగానికి బ్రేక్ పడింది ‘రివర్స్‌ టెండరింగ్‌’ పేరిట కాంట్రాక్టు సంస్థను మార్చేసింది జగన్ సర్కార్. అయితే ఇప్పుడు కేంద్రం కాలాన్ని కూడా రివర్స్‌ చేసి, 2013-14 అంచనాలే ఫైనల్‌ అని తేల్చేసింది. కేంద్రం తాజా నిర్ణయంతో  పోలవరం ప్రాజెక్ట్ పనులపై ఆందోళన నెలకొంది. కేంద్రం 15.6 వేల కోట్లే ఇస్తే.. ప్రాజెక్ట్ ఏపీ ప్రభుత్వానికి భారం కానుంది. అసలే అంతమాత్రంగా ఆర్థిక పరిస్థితి ఉన్న ఏపీకి ప్రాజెక్ట్ ను పూర్తి చేయడానికి కష్టమవుతుందనే చర్చ జరుగుతోంది. అదే జరిగితే ప్రాజెక్ట్ పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

 

అంధ్రప్రదేశ్ కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై తాజాగా జరుగుతున్న పరిణామాలు ప్రజలను కలవరానికి గురి చేస్తున్నాయి. రాజకీయాల  కోసం జగన్ గతంలో చేసిన ఆరోపణలు వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు.