నా మౌనం వల్లే కాంగ్రెస్ రెచ్చిపోతుంది.. మళ్లీ లేచిన స్వామి..

 

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి.. ఈ పేరు వింటేనే మనకు గుర్తొచ్చేది వివాదాస్పద వ్యాఖ్యలు. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపైన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయమంటే ఎప్పుడూ ముందుంటారు. ఏదో ఒక విషయంపై కాంగ్రెస్ ను ఇరుకున పెట్టేస్తుంటారు. ఒక ఇష్యూ అయిపోయిందంటే.. మరో ఇష్యూని రెడీగా చేసుకొని.. కాంగ్రెస్ పై తన మాటల తూటాలు పేల్చుతుంటారు. అయితే కొన్ని రోజుల నుండి స్వామిగారు ఎందుకో తన నోటికి పని చెప్పకుండా సైలెంట్ గా ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదనుకోండి.

 

కొద్ది రోజుల క్రితం స్వామి ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్, ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలపై తను ఇష్టమొచ్చినట్టు ఆరోపణలు గుప్పించారు. అయితే ముందు అందరూ సైలెంట్ గా ఉన్నా ఆతరువాత మాత్రం అందరూ విమర్శలు గుప్పించారు. ఇక ప్రధాని మోడీ కూడా స్వామి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పార్టీ అధిష్టానం కూడా చివాట్లు పెట్టింది. దీంతో ఆయన కొన్ని రోజుల నుండి సైలెంట్ గా ఉన్నారు. అయితే మాట్లాడని వాళ్లని సైలెంట్ గా ఉండటం కష్టం కాదు కానీ.. కాస్త నోరు ఎక్కువున్న స్వామి లాంటి వాళ్ల నోటిని కట్టడి చేయడం కొంచం కష్టమైన పని.

 

ఇప్పుడు ట్విట్టర్ ద్వారా కాంగ్రెస్ ను విమర్శించారు. ప్రస్తుతం రాజ్యసభలో ప్రత్యేక హోదాపైనా.. గుజరాత్ దళితులపై దాడుల గురించి చర్చ జరగాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీపై ఆరోపణలు గుప్పిస్తోంది. బీజేపీ కావాలనే చర్చ జరగకుండా అడ్డుపడుతోందని.. చర్చ ఖచ్చితంగా జరగాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ఇక వీటన్నింటిని చూసి స్వామి ఊరుకుంటాడా.. తన మౌనం వల్లనే రాజ్యసభలో కాంగ్రెస్ రెచ్చిపోతోందని అన్నారు. "రాజ్యసభలో నేను నోరెత్తకుండా ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ దూసుకుపోతోంది. ఇది యాదృశ్చికమా?" అని ప్రశ్నించారు. మరి నిజంగా స్వామి అన్నట్టు.. ఈయన సైలెంట్ గా ఉన్నందుకే కాంగ్రెస్ రెచ్చిపోతుందా.. చూద్దాం.. మరి ఆయన ఎన్నిరోజులు సైలెంట్ గా ఉంటారో..