బీజేపీ తప్పులో కాలు?

లోక్‌సభలో రాహుల్ గాంధీ అనర్హత వేటు వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకించే ,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్, తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  సహా అన్ని పార్టీలూ, అందరు నాయకులు ఖండిస్తున్నారు. ఇక కాంగ్రెస్, కాంగ్రెస్ మిత్ర పక్షాల సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. నిజానికి ఈ పరిణామం, కాంగ్రెస్ అనుకూల, వ్యతిరేక విపక్షాలు అన్నిటినీ ఏకం చేసింది. తాత్కాలికంగా అయినా  ఏకతాటిపైకి   తీసుకువచ్చిందని బీజేపీ అనుకూల మీడియా, మేథావి వర్గాలు కూడా అంటున్నాయి. బీజేపీ తప్పులో కాలేసిందనే అభిప్రాయమే ఆ వర్గాల నుంచి వ్యక్తమౌతోంది. 

ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన వ్యవసాయ చట్టాలు మొదలు, ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకున్న మరికొన్ని వివాదాస్పద నిర్ణయాలను చాలా గట్టిగా సమర్ధించిన లోక్ సత్తా నేత  జయ ప్రకాష్ నారాయణ్   సైతం ఈవిషయంలో మోడీ ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. ప్రతి చిన్న విషయానికీ అనర్హతను అస్త్రంగా ఉపయోగిస్తే ప్రజాస్వామ్యం క్షీణించిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  రాహుల్‌ గాంధీకి పై కోర్టులలో అప్పీల్‌ చేసుకునే వెసులుబాటు ఉందని.. ఒకవేళ పై కోర్టులో శిక్షను తగ్గించినట్లయితే, అనర్హత వేటును వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందని జయప్రకాష్ నారాయణ వివరించారు. ఇలాంటి సందర్భంలో లోక్‌సభ అధికారులు రాహుల్‌పై వెంటనే అనర్హత వేటు వేయకుండా  కాస్త వేచి చూస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే ఎన్నికల వ్యూహకర్త, ప్రశాంత్ కిషోర్ కూడా చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి అనుకూలంగా స్పందించారు. ఒక పరువు నష్టం కేసులో రెండేళ్ల శిక్ష పడటం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే అధికార పక్షం కూడా కొంత పెద్ద మనసు చేసుకోవాల్సిందని సూచించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసే నిర్ణయాన్ని అంత వేగంగా తీసుకుని ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు.

రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు తీర్పును పై కోర్టులో అప్పీల్ చేసే గడువు ఇవ్వాల్సిందని పేర్కొన్నారు. నేను న్యాయ నిపుణుడిని కాదు. కానీ ప్రాసెస్ ఆఫ్ లాను చూస్తే రాహుల్ కి విధించిన శిక్ష మోతాదు ఎక్కువే అనిపిస్తున్నది. ఎన్నికల వేడిలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇదే చివరిదీ కాబోదు  అని అన్నారు. అటల్ బిహారీ వాజ్ పేయి  చిన్న హృదయంతో పెద్దోడివి కాలేవు అనే మాటను కేంద్రం గుర్తు చేసుకోవాలి  అని ప్రశాంత్ కిషోర్  అన్నారు.

నిజానికి ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీకి ప్రత్యక్ష ప్రమేయం లేక పోయినా  సమయం, సందర్భాలను బట్టి తెర వెనక తతంగం అంటా కమల నాథులే కానిచ్చారనే విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆర్థిక అవకతవకల వ్యవహారంలో చిక్కున్న ఆదానీ వ్యవహారంలో మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడడం పలు అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోందని, అంటున్నారు.

ఆదానీని కాపాడేందుకు రాహుల్ పై వేటు  వేశారనే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణకు బలం చేకురుతోందని మేథావులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో వంక కాంగ్రీస్ పార్టీ  రాహుల్ అనర్హతకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఆందోళనలకు పిలుపు నివ్వడంతో బీజేపీ ఇరకాటంలో పడిందనే అభిప్రాయం బలపడుతోంది. ఒక విధంగా సెల్ఫ్ గోల్ చేసుకుందని అంటున్నారు.