రెండు రోజుల్లో పోలింగ్.. బీజేపీకి హ్యాండిచ్చి సీఎం భార్యకు జై

 

ఎన్నికలు వస్తే పార్టీల హడావుడి అంతా ఇంత కాదు. పోటీపడి ప్రచారాలు చేస్తూ తమ అభ్యర్థి గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తాయి. ఇక రెండు రోజుల్లో ఎన్నికలైతే పార్టీల హడావుడి ఎంతలా ఉంటుందో మాటల్లో చెప్పలేము. మరి అలాంటి సమయంలో అభ్యర్థి పోటీ నుంచి తప్పుకుంటున్నాను అంటూ హ్యాండిచ్చి వేరే పార్టీలో చేరితే ఆ పార్టీ పరిస్థితి ఏంటి?.. ఊహించుకుంటుంటేనే జాలేస్తుంది కదా. పాపం తాజాగా బీజేపీకి అలాంటి పరిస్థితే ఎదురైంది. కర్ణాటకలోని రామనగర శాసన సభ ఉపఎన్నికల పోలింగ్ ఈ నెల 3 న జరగనున్నాయి. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కర్ణాటక సీఎం హెచ్.డి. కుమారస్వామి సతీమణి అనితా కుమారస్వామి జేడీఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పోటీ నుంచి దూరం చెయ్యడంతో అదే ప్రాంతానికి చెందిని ఆ పార్టీ నాయకుడు చంద్రశేఖర్ నెల రోజుల క్రితం బీజేపీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన చంద్రశేఖర్ మీద నమ్మకంతో ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయనకు మాజీ సీఎం బీఎస్. యడ్యూరప్ప అవకాశం ఇచ్చారు.

ఇంతకాలం బీజేపీ అభ్యర్థిగా ప్రచారం చేసిన చంద్రశేఖర్ రెండు రోజుల్లో పోలింగ్ జరుగుతున్న సమయంలో పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్ లో చేరిపోయి అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు. ఈ దెబ్బతో బీజేపీ నాయకులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. బీజేపీ నాయకులు ప్రచారం చెయ్యడానికి రావడంలేదని, ఫోన్ లో వారిని సంప్రధించడానికి ప్రయత్నిస్తే అందుబాటులోకి రావడంలేదని, నాయకులు ప్రచారానికి రాకపోతే కార్యకర్తలు ఓటు ఎలా వేస్తారని, అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నానని చంద్రశేఖర్ మీడియాతో చెప్పారు. ఎమ్మెల్యే ఉపఎన్నికల పోటీ నుంచి తప్పుకున్న చంద్రశేఖర్ కాంగ్రెస్ లో చేరిపోయాడని తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు రామనగర బీజేపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. చంద్రశేఖర్ నమ్మించి బీజేపీకి ద్రోహం చేశారని, కాంగ్రెస్-జేడీఎస్ నాయకులకు అమ్ముడుపోయారని ఆరోపించారు. మొత్తం మీద చంద్రశేఖర్ చేసిన పనికి రామనగరలో బీజేపీ అభ్యర్థి లేకుండానే ఉప ఎన్నికలు జరుగనున్నాయి.