రాహుల్ గాంధీతో చంద్రబాబు మంతనాలు

 

భాజపాపై సమరశంఖం పూరించిన తెదేపా జాతీయ అధ్యక్షుడు,ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భాజపా యేతర పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.అందులో భాగంగా ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు జాతీయ స్థాయి నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు.ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నివాసానికి చేరుకున్న చంద్రబాబు.. పవార్‌తో పాటు ఫరూక్‌ అబ్దుల్లాతోనూ భేటీ అయ్యారు. సాధారణ ఎన్నికలు, దేశంలో జరుగుతున్న పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలతో పాటు వివిధ పార్టీల నేతలు, సంస్థలపై జరుగుతున్న దాడులపై చర్చించారు. సీబీఐ, ఆర్బీఐ వంటి కేంద్ర వ్యవస్థల నిర్వీర్యం తదితర అంశాలపై ముగ్గురు నేతలూ కలిసి చర్చించారు.అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు.

 

 

ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్న చంద్రబాబుకు రాహుల్ గాంధీ స్వాగతం పలికారు.కార్యాలయంలోకి వెళ్లిన చంద్రబాబు, రాహుల్‌కు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం బొబ్బలి వీణను రాహుల్‌కు బహుకరించారు.చంద్రబాబు కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడితో రాజకీయ సంప్రదింపులు జరపడం 20 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. భేటీలో ప్రధానంగా దేశంలో భాజపాయేతర పార్టీలతో కూటమి ఏర్పాటుపైనే చర్చించుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలోని మహాకూటమి అంశంపైనా ఇరువురి మధ్య చర్చ జరగనున్నట్టు సమాచారం.గత కొంతకాలంగా దేశంలో జరుగుతున్న అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు కాంగ్రెస్‌తో స్నేహంపై వ్యూహాత్మంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపైనే ఉంటుందని రాహుల్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సఖ్యతకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.రాహుల్‌తో భేటీలో సీఎం వెంట ఎంపీలు సీఎం రమేశ్‌, గల్లా జయదేవ్‌, కనకమేడల రవీంద్రకుమార్‌, మంత్రులు కళావెంకట్రావు, యనమల, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌ రావు ఉన్నారు.