జగన్‌ను క్రిస్టియన్ సీఎం అంటూ సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యలు

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ను క్రిస్టియన్ సీఎంగా అభివర్ణిస్తూ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. 

తిరుమల శ్రీవారి ఆస్తులను వేలం వేయాలని చూసిన టీటీడీ.. తీవ్ర విమర్శలు ఎదురు కావడంతో తాత్కాలింకగా వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. కాగా, టీటీడీ ఆస్తుల వేలం వ్యవహారంపై సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్ వేదికగా స్పందించారు. హిందూ దేవాలయాలు ప్రభుత్వాల అధీనంలో ఉండకూడదని చాలాకాలంగా వాదిస్తున్న సుబ్రహ్మణ్య స్వామి.. ఈ విషయంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ కూడా వేశారు. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి టీటీడీ ఆస్తుల వేలం వ్యవహారంపై ఘాటుగానే స్పందించారు. ఏపీ సీఎం జగన్‌ను క్రిస్టియన్ సీఎంగా అభివర్ణిస్తూనే.. ఒకరకంగా జగన్‌కు మద్దతుగానే ట్వీట్ చేశారు.

"టీటీడీ భూముల వేలంపై ఒక క్రైస్తవ ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలంటూ హిందువులు డిమాండ్ చేస్తున్నారు సరే. అయితే ఓ హిందూ ముఖ్యమంత్రి ఏకంగా రాష్ట్రంలోని ఆలయాలన్నిటినీ ఆధీనంలోకి తీసుకుని, తనను తాను చైర్మన్‌గా ప్రకటించుకున్నారు కదా. మరి దాని సంగతి ఏమిటి? హిందూత్వ పట్టాలు తప్పిందా?" అని సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నించారు.