నిన్న అద్వానీ, నేడు మనోహర్ జోషి.. బీజేపీ నేతలకు అవమానం

 

ఎన్నికల వేళ బీజేపీ ఆ పార్టీ సీనియర్లకు షాకిస్తూ వారికి చేదు అనుభవాన్ని మిగుల్చుతుంది. ఇప్పటికే ఎల్‌కే అద్వానీకి బీజేపీ టికెట్ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆయన నియోజవర్గం గాంధీనగర్ టికెట్‌ను బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకి కేటాయించారు. దీంతో అద్వానీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే ఇప్పుడు మరో బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషికి కూడా ఆ పార్టీ  నాయకత్వం  ఊహించని షాక్ ఇచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడా ఆయన పోటీ చేయవద్దని ఆదేశించింది. ఈ మేరకు ఆయన తన నియోజకవర్గం కాన్పూర్ ప్రజలకు రాసిన లేఖలో స్వయంగా వెల్లడించారు. ‘ప్రియమైన కాన్పూర్ ఓటరులారా.. నేను కాన్పూర్ సహా మరెక్కడా ఎన్నికల్లో పోటీ చేయరాదని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంలాల్ తెలియజేశారు.’ అని ఆయన పేర్కొన్నారు.

మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీలతో పాటు బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో మనోహర్ జోషి కూడా ఒకరు. మనోహర్ జోషి.. 2014లో ప్రధాని మోదీ కోసం వారణాసి స్థానాన్ని త్యాగం చేశారు. కాన్పూర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తీరా ఇప్పుడు కాన్పూర్ నుంచి కూడా పార్టీ నాయకత్వం ఆయనను తప్పించింది. దీంతో పార్టీ నాయకత్వం వ్యవహరించిన తీరుపై జోషి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రాంలాల్‌తో సందేశం పంపించి తాను పోటీచేయరాదంటూ చెప్పడంతో ఆయన దీనిని అవమానంగా భావిస్తున్నట్టు చెబుతున్నారు. కనీసం పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా తన వద్దకు వచ్చి ఈ విషయం చెప్పాల్సిందంటూ జోషి ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఉత్తర ప్రదేశ్‌లో ప్రచారం కోసం బీజేపీ విడుదల చేసిన 40 మంది స్టార్ క్యాంపైనర్ల జాబితాలో కూడా అద్వానీ, మనోహర్ జోషిలకు స్థానం లభించలేదు. బీజేపీ వ్యవస్థాపక సభ్యుల విషయంలో పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నాయకత్వం స్వయంగా వారిని కలిసి వారికి విశ్రాంతి ఇస్తున్నామని చెప్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి బీజేపీ నాయకత్వం సొంత పార్టీ సీనియర్ నేతలనే అవమానించిందంటూ విమర్శలు ఎదురవుతున్నాయి.