తెలంగాణా బిల్లుకి బీజేపీ మద్దతు ఇస్తుందా లేదా?

 

తెలంగాణా బిల్లుకు బీజేపీ మద్దతు ఇస్తుందో లేదో అనే సంగతి నేడో రేపో ఇంక బయటపడనుంది. కాంగ్రెస్ అధిష్టానం సభలో సభ్యులను అదుపు చేయకుండా నాటకాలు ఆడుతోందని ఆరోపణలు చేస్తున్న బీజేపీ, ఒకవేళ బిల్లుకి మద్దతు ఈయదలుచుకోకపోయినట్లయితే, ఇంతమంది సభ్యులను సస్పెండ్ చేయడాన్ని తప్పు పడుతూ వాదనకు దిగవచ్చును. మద్దతు ఈయదలిస్తే ఇదే సాకుతో సభ నుండి వాకవుట్ చేసి పరోక్షంగా సహకరించవచ్చును.

 

కానీ, బిల్లు ఆమోదానికి సహకరిస్తే తెలుగుదేశం పార్టీతో పొత్తుల ప్రసక్తి ఇక మరిచిపోవలసి ఉంటుంది. ఒకవేళ బీజేపీ బిల్లు ఆమోదానికి సహకరించినా దానివలన బీజేపీకి తెలంగాణాలో కొత్తగా వచ్చే లాభమేమీ ఉండబోదు. ఆ క్రెడిట్ అంతా తెరాస, కాంగ్రెస్ పార్టీలే పొందుతాయి తప్ప బీజేపీ కాదు. కనీసం అందుకు ప్రతిగా మరికొన్ని యంపీ, యం.యల్యే. సీట్లయినా పెరుగుతాయనే నమ్మకం లేదు. ఇక అక్కడ తనంతట తానుగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితే లేదు.

 

అదీగాక బీజీపీ లక్ష్యం తెలంగాణాలో పార్టీని బలపరుచుకోవడం కాదు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం. అందువల్ల బీజేపీకి సీమాంధ్రలో ఉన్న25యంపీ సీట్లు చాలా కీలకమయినవి. గనుక, కనుక, బీజేపీ సీమాంధ్రకు న్యాయం చేయలేదంటూ బిల్లు ఆమోదం పొందకుండా అడ్డుకొనే ప్రయత్నం చేసినా చేయవచ్చును. లేదా బిల్లులో వివిధ అంశాలపై చర్చకు పట్టుబట్టి కాలయాపన చేసి బిల్లు ఆమోదం పొందకుండా చేయవచ్చును. అప్పుడు తెదేపా, వైకాపా ఇంకా సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మద్దతు కూడా బీజేపీ ఆశించవచ్చును. ఎన్నికల తరువాత బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశముంటే, తెలంగాణా ఏర్పాటు కోసం తెరాస కూడా తప్పనిసరిగా బీజేపీకే మద్దతు ఈయక తప్పదు. అందువల్ల ఇప్పుడు బిల్లు ఆమోదం పొందకుండా బీజేపీ అడ్డుపడినందుకు బీజేపీ తాత్కాలికంగా తెలంగాణాలో నష్టపోవచ్చునేమో కానీ, కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ఏర్పాటు చేసినందుకు అందుకు పూర్తి ప్రతిఫలం ఆశించవచ్చును.

 

కానీ, రాష్ట్ర విభజన చేయకపోయినట్లయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణా లో కూడా తుడిచిపెట్టుకొని పోయే ప్రమాదం ఉంది గనుక ఎట్టిపరిస్థితుల్లో బిల్లుని ఏదోవిధంగా ఆమోదింపజేసేందుకే ప్రయత్నించవచ్చును. కానీ, తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనానికి అంగీకరించనట్లయితే, బీజేపీ కోరిన విధంగా వ్యవహరిస్తూ బిల్లు ఆమోదింపజేయకుండా సమావేశాలు ముగించవచ్చును.

 

ఏమయినప్పటికీ, ఈ రాజకీయ చదరంగంలో రాష్ట్ర విభజన అంశం ఒక పావుగా మారిపోయింది. ఈ ఆటలో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు? విభజన జరుగుతుందా లేదా? అనే విషయాలు మరొక వారం రోజుల్లో స్పష్టంగా తెలిసిపోతాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu