కు.ని. ఆపరేషన్లు.. ఖూనీ ఆపరేషన్లు
posted on Nov 12, 2014 9:18AM

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని లోని బిలాస్‌పూర్‌లో ప్రభుత్వం నిర్వహించిన వైద్యశిబిరంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్న మహిళల్లో మృతి చెందిన వారి సంఖ్య 11కు చేరింది. చనిపోయిన మహిళలంతా 22 నుంచి 32 ఏళ్ల లోపు వయసు వారే. ఈ విషాద ఘటనకు సంబంధించిన నలుగురు వైద్యాధికారులను ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల క్యాంపులో 83 మంది మహిళలు ఆపరేషన్లు చేయించుకోగా వారిలో 11 మంది మహిళలు ఆపరేషన్లు వికటించి మృతిచెందారు. మరో 49 మంది ప్రమాదకర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు 24 గంటల వ్యవధిలోనే వాంతులు, పొత్తి కడుపులో నొప్పితో ఆస్పత్రులపాలయ్యారు. తీవ్ర రక్తస్రావం కారణంగా శరీరానికి గుండె తగినంత రక్తం సరఫరా చేయలేకపోవడం, ఆపరేషన్ చేసిన ప్రదేశంలో ఇన్‌ఫెక్షన్ సోకడం వల్ల మరణాలు సంభవించి వుండొచ్చని తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు జిల్లా యంత్రాంగం తొలుత 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించగా రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ దాన్ని 4 లక్షలకు పెంచారు.