ఒక్కటోసారి..రెండో స్సారి...మూడో స్సారి....

 

ట్రాజెడీలో కామెడీ సృష్టించగల నేర్పు కేవలం చార్లీ చాప్లిన్ కి మాత్రమే ఉందనే ప్రజల అపోహాలను దూరం చేస్తూ కోట్లాది తెలుగు ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న సున్నితమయిన రాష్ట్ర విభజన అంశాన్ని తీసుకొని కాంగ్రెస్ నేతలు మంచి టైమింగ్ తో చక్కటి కామెడీ చేస్తూ సీమాంధ్ర ప్రజల దుఃఖాన్నిమరిపింపజేస్తున్నారు. అందులో భాగంగానే కొందరు యంపీలు రాజీనామాలు చేయడం దానిని స్పీకర్ తిరస్కరించడమనే డ్రామా చాలా చక్కగా నడుస్తోంది.

 

వారి రాజీనామాలు ఆమోదించమని కోర్టులు స్పీకర్ ను ఆదేశించలేవనే రహస్యం ప్రజలందరికీ తెలియదు గనుక, ఈ డ్రామా మరింత రక్తి కట్టేందుకు కొందరు కోర్టుని కూడా వాడేసుకొంటున్నారు. వేలంపాటలోఒక్కటోసారి..రెండో స్సారి...మూడో స్సారి....అని పాటకి ముగింపు ఉంటుందేమో గానీ ఇక్కడ మాత్రం ఈ రాజీనామాల పాట నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంది, మరో వైపు విభజన ప్రక్రియ కూడా సజావుగా సాగిపోతూనే ఉంటుంది.

 

అంటే రాష్ట్ర విభజన విభజనే, సమైక్యం సమైక్యమేనన్నమాట. అందుకే ఉండవల్లి, లగడపాటి, సాయి ప్రతాప్ మరియు సబ్బం హరిలు మళ్ళీ మూడో... స్సారి రాజీనామాలు సమర్పించి, మళ్ళీ వీటిని కూడా స్పీకర్ తిరస్కరించవచ్చని ముందే ప్రకటించేశారు.

 

ఇక్కడ రాజీనామాల డ్రామా సరదా సరదాగా సాగిపోతుంటే మరో వైపు రాష్ట్రంలో కొందరు యంపీలు ‘విభజన పక్కా...ఇందులో డౌట్ లేదు అందరూ ప్రిపేర్ అయిపోండి!’ అని జనాల కంటే ముందు వారే మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ డ్రామాలో క్లైమాక్స్ సీన్ కోసం మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే వ్రాసుకొని, అందుకోసం రిహార్సల్స్ కూడా మొదలు పెట్టేసారు.

 

ఆ క్లైమాక్స్ సీన్ కోసం తను వ్రాసుకొన్నఓ పంచ్ డైలాగు-‘ఈ మీ కిరణ్ దేవుడు పంపిన తుఫానుని అడ్డుకోలేడేమో కానీ మా అధిష్టానం చేస్తున్న రాష్ట్ర విభజన తుఫానును మాత్రం మోకాలు అడ్డుపెట్టయిన ఆపగలడని’ పలికి జనాల చేత చప్పట్లు కొట్టించు కోవడమే కాక అటు తెలంగాణా వైపు నుండి కూడా మంచి రెస్పాన్స్ రాబట్టగలిగారు.  కానీ దేని దారి దానిదే అన్నట్లు, రాష్ట్ర విభజనకు అవసరమయిన కార్యక్రమాలు చెప్పటేందుకు రాష్ట్రంలో శాఖలు వారిగా బాధ్యతల అప్పగింతలు కూడా జరిపోయినట్లు తాజా సమాచారం.

 

ఏమయినప్పటికీ సున్నితమయిన రాష్ట్ర విభజన అంశాన్ని తీసుకొని ఇంత బాగా స్క్రీన్ ప్లే వ్రాసుకోవడం, దానిని ఇంత వైరుద్యం గల కాంగ్రెస్ పాత్రదారులతో ఎక్కడ తొణకకుండా రక్తి కట్టించడం త్రివిక్రమ్, రాజమౌళి వంటివారికి కూడా సాధ్యమా కాదని చెప్పవచ్చును.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu