ఎన్నికల సంఘమా.. ఇదెక్కడి చోద్యం?

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది. ప్రపంచానికి ఓటు హక్కు విలువను తెలియజెప్పిన మన దేశం ఇప్పుడు ఏదో ఒక ఆశ చూపితే తప్ప ఓటు వేయని ఓటర్లతో నిండిపోయి సర్వనాశనమయ్యే దిశగా వెళ్తోంది. రాజకీయ నాయకులు ఓటర్లకి తాయిలాల ఎరచూపి ఓట్లు వేయించుకోవడంతో ప్రారంభమైన ఈ జాడ్యం, ఇప్పుడు తాయిలాలు ఇస్తే తప్ప ఓటు వేయం అని ఓటర్లు చెప్పే పరిస్థితి వరకు పరిస్థితి దిగజారింది. ఎవరో ఒక రాజకీయ నాయకుడు డబ్బు ఇస్తే, విశ్వాసంతో అతనికే ఓటు వేసే పరిస్థితి నుంచి, అందరి దగ్గర డబ్బు తీసుకుని వేస్తే ఏ ఒక్కరికో.. లేక ఎవరికీ ఓటు వేయకుండా ఊరుకునే పరిస్థితికి ఓటర్లు చేరుకున్నారు. ఓటు వేయడం అనేది హక్కు, బాధ్యత అనే విషయం మరచిపోయి పథకాలు ఇస్తేనే, తాయిలాలు ప్రకటిస్తేనే ఓటు వేస్తామని చెప్పే దౌర్భాగ్య స్థితికి ఎన్నికల వ్యవస్థ చేరుకుంది. ఇప్పుడు చాలామంది ఓటర్లు ఎలా తయారయ్యారంటే, పథకాల ద్వారా డబ్బు ఇవ్వాలి, ఎలక్షన్లు వచ్చినప్పుడు 
ఓటు వేయడానికి డబ్బు ఇవ్వాలి. ఇందులో ఓటర్లకు డబ్బు ఎరచూపే రాజకీయ నాయకులది తప్పా.. ఓటుకోసం డబ్బు ఆశించే ఓటర్లది తప్పా అంటే, అది ‘విత్తుముందా.. చెట్టుముందా’ అనే ప్రశ్నకంటే సంక్లిష్టమైన ప్రశ్న అవుతుంది.

ఎలక్షన్ల వ్యవస్థలో రాజకీయ నాయకులు, ఓటర్ల మధ్య ఇలాంటి కానుకల బంధం కొనసాగుతూ, ప్రజాస్వామ్య విలువలను ఒకవైపు ప్రశ్నార్థకంలో పడేస్తుంటే, మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా ఓటర్లకు తాయిలాలు ఇచ్చే కార్యక్రమానికి తెరతీసింది. ఓటు వేసేలా ఓటర్లలో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహిస్తే ఓకేగానీ, ఓటు వేయండి, కానుకలు ఇస్తాం అని సాక్షాత్తూ ఎన్నికల కమిషనే అంటూ వుండటం ఘోరం.. దారుణం.. అన్యాయం.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లను ఓటు వేసేలా చేయడానికి ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ‘ఓటు వేయండి.. బహుమతులు పొందండి’ అటూ ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ప్రకారం, ఓటు వేసిన ఓటర్లకు లక్కీ డ్రా ద్వారా డైమండ్ రింగ్‌లు గెలుచుకునే సదవకాశాన్ని ఇస్తోంది. ఓటర్లు ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రం బయటకి వచ్చి, తమ చేతికి వున్న ఇంకు గుర్తును చూపించి, లాటరీలో తమ పేరు నమోదు చేసుకోవాలి. ఇలా రెండు గంటలకోసారి లాటరీ తీసి, ఈ రెండు గంటల్లో ఓటు వేసిన వారికి ఒక డైమండ్ రింగ్ ఇస్తారు. భోపాల్ నియోజకవర్గంలో ఈనెల 7వ తేదీన మూడో విడత పోలింగ్ జరగనుంది. రెండు విడతల్లో తక్కువ పోలింగ్ నమోదైన నేపథ్యంలో మూడో విడత పోలింగ్‌ శాతాన్ని పెంచడానికి అక్కడి ఎన్నికల కమిషన్ ఈ డైమండ్ రింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన ఎన్నికల కమిషన్‌ని ఏమనాలో అర్థంకావడం లేదని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు.