ఏపీ మద్యం కుంభకోణం.. భారతీ సిమెంట్స్ డైరెక్టర్ అరెస్ట్

అరెస్ట్.. రాజ్ కేసిరెడ్డి అప్రూవర్? వాట్ నెక్స్ట్!
 

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.   ఈ కేసులో నిందితుడిగా ఉన్న భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను సిట్‌ అధికారులు అరెస్ట్‌ చేశారు. పక్కా సమాచారంతో మైసూరులో ఆయన్ను అరెస్ట్‌ చేసి విజయవాడకు తరలించారు. గోవిందప్ప భారతీ సిమెంట్స్‌ పూర్తికాలపు డైరెక్టర్‌గా ఉన్నారు. భారతీ సిమెంట్స్‌లో వైఎస్ భారతి ఆర్థిక వ్యవహారాలన్ని ఆయనే చక్కబెడతారని అంటారు. 

మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలంటూ గోవిందప్పతో పాటు సీఎంవో మాజీ కార్యదర్శి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డికి   సిట్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ ముగ్గురినీ విజయవాడ కమిషనరేట్‌లోని సిట్‌ కార్యాలయంలో ఆదివారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే ఈ ముగ్గురూ కూడా నోటీసులను బేఖాతరు చేస్తూ విచారణకు గైర్హాజరయ్యారు. ఇప్పటికే వీరి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టు సైతం వీరికి అరెస్టు నుంచి  మధ్యంతర రక్షణ ఇవ్వడానికి నిరాకరించింది.

జగన్‌కు బాలాజీ గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి అత్యంత సన్నిహితులు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలు చేయడం, ఆ సొమ్మును డొల్ల కంపెనీలకు మళ్లించడంలో కృష్ణమోహన్‌రెడ్డి,  గోవిందప్పలతో పాటు ధనుంజయరెడ్డి పాత్ర ఉంది. ముడుపులుగా ఎంత మొత్తం చెల్లించాలనేదానిపై ఈ ముగ్గురూ తరచూ హైదరాబాద్, తాడేపల్లిలో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో సమావేశమయ్యేవారని సిట్‌ ఇప్పటికే తేల్చింది. మద్యం ముడుపుల సొమ్మును రాజ్‌ కేసిరెడ్డి వీరికి చేరవేస్తే.. వీరు దాన్ని జగన్‌కు అందజేసేవారని ఇప్పటివరకూ అరెస్టైన నిందితులకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్టుల్లో సిట్ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో మైసూరులో బాలాజీ గోవిందప్పను సిట్‌ అరెస్ట్‌ చేసింది.

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఇప్పటికే కీలక నిందితులు రాజ్ కేసిరెడ్డి, ఆయన సహాయకుడు దిలీప్ లను అరెస్టు చేసింది. ఇరువురిరీ కూడా కస్టడీలోకి తీసుకుని విచారించింది. ప్రస్తుతం ఇద్దరూ రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకమైన ముగ్గురి కోసం వేట మొదలెట్టింది. అందులో భాగంగా జగన్ సతీమణి భారతి ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టే భారతీ సిమెంట్స్ పూర్తి కాలపు డైరెక్టర్ గోవిందప్పను అరెస్టు చేసింది. గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలు జగన్ కు అత్యంత సన్నిహితులు. ఈ ముగ్గురినీ అరెస్టు చేస్తే ఏపీ మద్యం కుంభకోణం గుట్టు విడిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ ముగ్గురిలో గోవిందప్ప అరెస్టయ్యారు. ఇక నేడో రేపో మిగిలిన ఇద్దరూ అంటే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిల అరెస్టు కూడా ఖాయమని అంటున్నారు.

ఇప్పటికే ఈ కేసులో అరెస్టై జైల్లో ఉన్న రాజ్ కేసిరెడ్డి అప్రూవర్ గా మారడానికి సిద్ధమైనట్లు వార్తలు వినవస్తున్నాయి. అదే జరిగితే మొత్తం జగన్ దోపిడీ వ్యవహారాలన్నీ వెలుగులోకి వస్తాయని అంటున్నారు. ఇక రాజ్ కేసిరెడ్డి అప్రూవర్ గా మారతారనడానికి ఆయన న్యాయవాది కోర్టులో చేసిన వాదనలే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో పెద్దలంతా తప్పించుకుని తన క్లయింట్ రాజ్ కేసిరెడ్డిని బలిపశువుగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆయన ఈ ప్రయత్నాలను సహించబోమనీ, అన్నీ బయటపెడతామనీ సంకేతాలు ఇచ్చారని అంటున్నారు.  ఏపీ లిక్కర్ కుంభకోణంలో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డి లాయర్ ఏకంగా కోర్టులోనే తన క్లయింట్ ను బలిపశువును చేశారంటే చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఇవే ఆరోపణలు రాజ్ కేసిరెడ్డి అప్రూవర్ గా మారనున్నట్లు దర్యాప్తు అధికారులకు పంపిన సందేశంగా కూడా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu