వైసీపీకి బాలినేని రాంరాం?

బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి. ఈ ఇద్దరూ బంధువులే కాకుండా ఒకప్పుడు ఆప్త మిత్రులు కూడా. అంతే కాదు ఇద్దరూ కూడా   సీఎం జగన్ మోహన్ రెడ్డికి బంధువులు. జగన్ కాంగ్రెస్ తో  విభేదించి సొంత కుంపటి పెట్టుకున్నప్పుడు ఇద్దరూ జగన్ వెంటే వచ్చారు. బాలినేని అయితే పదవులకు రాజీనామా చేసి మరీ జగన్ వెంట నడిచారు.. అందుకే అప్పటి నుండి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ ఇద్దరిదే వైసీపీలో పెత్తనం. అయితే  ఇద్దరితో పోలిస్తే సుబ్బారెడ్డి జగన్ కు మరింత దగ్గరి బంధువు. అందుకే ఆయనను రెండుసార్లు ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కట్టబెట్టారు. ఇక సమీకరణాల పేరుతో రెండున్నరేళ్లకే బాలినేనిని మంత్రి పదవి నుండి తప్పించారు. ఇక ఇప్పుడు సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పదవీ కాలం ముగిసి సొంత జిల్లాకు చేరిన క్షణం  నుంచీ అవుట్ అండ్ అవుట్ గా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుబ్బారెడ్డి హవాయే  సాగుతున్నది. నిజానికి చాలా కాలంగా బాలినేని జిల్లా రాజకీయాలలో సొంత పార్టీతోనే పోరాడుతున్నారు. పలుమార్లు అలకబూనడం.. అధిష్టానం పిలిచో, పిలిపించుకునో బుజ్జగించడం రివాజుగా మారిపోయింది. అయితే   ఇప్పుడు మాత్రం బాలినేనిలో  అసంతృప్తి తారస్థాయికి చేరిందంటున్నారు. 

రెండేళ్లుగా బాలినేని  సమయం వచ్చినప్పుడల్లా సొంత పార్టీలోనే రెబల్ గా వాయిస్ వినిపిస్తున్నారు. సొంత పార్టీ నేతల తప్పులను ఎత్తి చూపుతూ అధిష్టానానికి కంట్లో నలుసుగా మారిపోయారు. ముఖ్యంగా సుబ్బారెడ్డి అనుచరుల అక్రమాలను బయటపెడుతూ పార్టీలో చర్చకు తెర లేపారు. దీంతో ఆ మధ్య బాలినేని అనుచరులను పార్టీ నుండి సస్పెండ్ చేయగా బాలినేని వైసీపీ పెద్దలపై విరుచుకుపడ్డారు. ఆ తర్వాత మరోసారి జిల్లాలో తన మాటకు విలువ లేకుండా చేశారని ఆవేశాన్ని వెళ్లగక్కారు. ఆ తర్వాత సుబ్బారెడ్డి భూఅక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో అసలైన దోషులను వదిలేశారంటూ పోలీసులపైనే విమర్శల దాడి చేశా రు. దీంతో అలర్ట్ అయిన వైసీపీ అధిష్ఠానంబాలినేని పిలిచి బుజ్జగించి సంయమనం పాటించాలని జిల్లాలో అధికారం, పెత్తనం నీదే అంటూ హామీలిచ్చింది. కానీ, జిల్లాలో సుబ్బారెడ్డి హవాయే కొనసాగుతుండడంతో బాలినేనిలో అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరింది. దీంతో ఇక ఇప్పుడు బాలినేని పార్టీకి రాంరాం చెప్పేయాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ శ్రేణుల్లోనే జోరుగా ప్రచారం జరుగుతున్నది.

తాజాగా ఓ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఇకపై తాను జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ రోల్ పోషించబోతున్నట్లు చెప్పడం ద్వారా బాలినేనికి పార్టీలో ఇక చోటులేదన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. అంతేకాదు రాబోయే ఎన్నికల్లో తాను పోటీచేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో  వైసీపీ పార్టీ, పగ్గాలు గంపగుత్తగా సుబ్బారెడ్డి చేతుల్లో జగన్ పెట్టేశారని తేటతెల్లమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో బాలినేని పార్టీని వీడి వెళ్లడమో, లేకుంటే పార్టీయే అతడిని బయటకు పంపించడమో జరుగుతుందని అంటున్నాయి.   సుబ్బారెడ్డికి పూర్తి స్థాయిలో జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించడం అంటే ఇంత కాలం పొమ్మనలేక పొగబెట్టిన జగన్ ఇప్పుడు పొగ ఎందుకు అనుకున్నారో ఏమో బాలినేనిని పొమ్మని ఏకంగా మంటే పెట్టేశారని పరిశీలకులు అంటున్నారు.  జగన్ మోహన్ రెడ్డి బాలినేనిని వదులుకునేందుకు ఎప్పుడో సిద్ధమయ్యారని.. అందుకే ఇన్నాళ్లు ఇలా సుబ్బారెడ్డితో పొగబెట్టించారని వైసీపీలో చర్చ జరుగుతూ వచ్చింది. ఇక ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో  ముసుగులో గుద్దులాట, దాగుడుమూతలు ఎందుకనుకున్నారేమో.. నేరుగా సుబ్బారెడ్డి నోటితోనే జిల్లా పార్టీలో తాను యాక్టివ్ అవుతాననీ, వచ్చే ఎన్నికల బరిలో నిలుస్తానని చెప్పించి బాలినేనికి ఆయన స్థానం ఏమిటో డైరెక్ట్ గా చూపించేశారు.  

వైవీ సుబ్బారెడ్డి పోటీ చేస్తే ఒకటి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం లేదా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తారు. ఈ రెంటిలో ఏది జరిగినా బాలినేనికి చిక్కులు తప్పవు.  ఎందుకంటే ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి  బాలినేని   ఒంగోలు లోక్ సభ స్థానం నుంచి  మాగుంట శ్రీనివాసులు సిట్టింగులుగా ఉన్నారు. మాగుంట బాలినేని మనిషే. ఆర్ధిక బలమున్న మాగుంటను గత ఎన్నికల ముందు   బాలినేనే చొరవ చూపి వైసీపీలోకి తీసుకువచ్చారు. ఇప్పుడు ఇరువురూ కూడా పార్టీలో ఇమడలేకపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనూ ఇరువురూ కూడా తెలుగుదేశం పార్టీకి టచ్ లోకి వెళ్లారని గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.    ఇప్పుడు సుబ్బారెడ్డి వ్యాఖ్యలతో బాలినేని ఇక వైసీపీని వీడడం ఖాయమని రాజకీయ వర్గాలు  అంటున్నాయి. అదే జరిగితే రానున్న ఎన్నికలలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం క్లీన్ స్వీప్ కు మార్గం సుగమం అయినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu