మామ అల్లుళ్ళు మెచ్చిన నేత ఎవరో?
posted on Nov 16, 2018 5:00PM

నటుడిగా తండ్రి నట వారసత్వంతో పాటు రాజకీయ వారసత్వాన్ని ఉనికి పుచ్చుకున్న వ్యక్తి నందమూరి బాలకృష్ణ.సినిమాల్లో రాణిస్తున్నబాలయ్య గత ఎన్నికల్లో టీడీపీ కంచుకోట అయిన హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై శాసన సభలో అడుగుపెట్టారు.ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన తరువాత కూడా సినిమాలతో బిజీ అవ్వటంతో నియోజకవర్గంలో రాజకీయ వ్యవహారాలు, అభివృద్ధి పనులు పర్యవేక్షించటానికి పీఏలను నియమించారు.అయితే మొదట నియమించిన అతనిపై వ్యతిరేకత రావటంతో మరొకరికి భాద్యతలు అప్పగించారు.అయితే అతను కూడా వెళ్లిపోవడంతో ప్రస్తుతం నియోజకవర్గంలో పనులు, రాజకీయ వ్యవహారాలు మరొకరు పర్యవేక్షిస్తున్నారు.దీంతో స్థానిక నేతల్లో అసంతృప్తి నెలకొంది.వ్యక్తులు మారుతున్నారు తప్ప ఏ ఒక్కరూ సరైన తీరులో పరిపాలనా భాద్యతలు నిర్వర్తించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు సీఎం పేషీకి, మంత్రి లోకేష్ కు ఇదే విషయంపై పిర్యాదు కూడా చేశారు.అసలే ఎన్నికలు కూడా దగ్గర పడుతుండటం వల్ల నియోజకవర్గంలో రాజకీయ వ్యవహారాలు చూసుకునేందుకు ఓ కీలక నేతను ఇన్‌చార్జిగా నియమించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే బాలయ్య,లోకేష్ ఆ నేత ఎవరనే దానిపై కసరత్తు చేసి ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.ఈ మేరకు స్థానిక నాయకులకు కూడా సమాచారం అందినట్లు తెలుస్తోంది.త్వరలోనే ఆ నేత నియోజక వర్గ ఇన్‌చార్జిగా భాద్యతలు చేపట్టనున్నారట.ఇంతకీ మామ అల్లుళ్ళు మెచ్చిన ఆ నేత ఎవరో అని అంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారట.