మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి బెయిలు

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి  ఏపీ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది.  మంత్రి రోజాపై, ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై  పోలీసులు బండారు సత్యనారాయణ మూర్తిపై కేసు నమోదు చేశారు.

పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించి, ఆయన సోదరుడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తే కోర్టుకు 41ఏ నోటీసులు అందించామని తప్పుడు సమాచారం ఇచ్చి మరీ అరెస్టు చేశారు. వందల సంఖ్యలో పోలీసులతో ఆయన ఇంటిని దిగ్బంధనం చేసి మరీ బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు.  తనకు బెయిల్ మంజూరు చేయాలన్న బండారు అభ్యర్థనను పరిశీలించిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్వర్వులు జారీ చేసింది.

బండారుకు భారీ ఊరట లభించిన విషయాన్ని పక్కన పెడితే ఆయనను అరెస్టు చేసిన విధానం మాత్రం తీవ్ర విమర్శల పాలౌతోంది. బండారుకు నోటీసులు ఇచ్చామంటూ కోర్టులో చెప్పడాన్ని  ఎత్తి చూపితే.. నిజంగానే నోటీసులు ఇచ్చి ఉంటే బండారును అరెస్టు చేసే అవకాశమే ఉండదనీ, కేవలం విచారణకు రావాల్సిందిగా మాత్రమే కోరాలని అంటున్నారు.  కానీ పోలీసులు కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి మరీ అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని, మంత్రి రోజానూ దూషించారంటూ  కేసులు నమోదు చేసి ఆయనను అరెస్టు చేయడంపై కూడా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అరెస్టు ఏపీలో భారత రాజ్యాంగం కాకుండా ఒక ప్రత్యేక రాజ్యాగం అమలులో ఉందన్న ఆరోపణలకు బలం చేకూర్చేదిగా ఉంది.

ముఖ్యమంత్రిని, రోజానూ దూషించారంటూ బండారును అరెస్టు చేయడానికి నిబంధనలను సైతం తుంగలోకి తొక్కడమే కాకుండా, న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టించిన పోలీసులకు, నిత్యం బూతుల పంచాగంతో విపక్ష నేతలపై విరుచుకుపడే వైసీపీ నేతలు కనిపించడం లేదా, వారి దూషణలు వినిపించడం లేదా అని సామాన్యులు సైతం నిలదీస్తున్నారు. ఏపీలో అధికార పార్టీ నేతలకు చట్టాలు వర్తించవా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.