తెలంగాణ తరఫున ఆడటానికి నేను బతికే వున్నా... జ్వాల
posted on Jan 22, 2015 8:52PM

గుత్తా జ్వాల ప్రతిభావంతురాలైన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మాత్రమే కాదు.. మంచి ధైర్యవంతురాలు కూడా. ఎంత ధైర్యంగా అయినా జ్వాల మాట్లాడగలదు. ట్విట్టర్లో కామెంట్లు పెట్టగలదు. మొన్నామధ్య సైనా నెహ్వాల్ తన పేరును పద్మభూషణ్‌కి రికమండ్ చేయాలని అంటూ వివాదం రేపినప్పుడు గుత్తా జ్వాల ట్విట్టర్లో వెంటనే రియాక్ట్ అయింది. అడిగి అవార్డులు తీసుకోవడం దేనికి... అర్హత వుంటే అదే వస్తుంది అని కామెంట్ చేసింది. ఇప్పుడు ఆమె తెలంగాణ ప్రభుత్వానికి షాకిచ్చే విధంగా ట్విట్టర్లో కామెంట్ పోస్ట్ చేసింది. నేషనల్ గేమ్స్‌కి తెలంగాణ నుంచి ఒక బెంగాలీ యువతిని పంపిస్తున్నారని, ఈ విషయం మీద ఎవరూ ఏమీ మాట్లాడడం లేదని, తెలంగాణ నుంచి జాతీయ క్రీడల్లో ఆడటానికి తామింకా బతికే వున్నామని గుత్తా జ్వాల ట్విట్ చేసింది. ఈ ట్విట్ క్రీడా వర్గాల్లో మాత్రమే కాకుండా, తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో కూడా భారీ సంచలనం రేపింది. తెలంగాణ రాష్ట్రంలో అనేకమంది క్రీడాకారిణులు ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఒక్క సానియాకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తోందన్న కడుపు మంట కూడా గుత్తా జ్వాలకు ఉన్నట్టుంది.