అదే హుషారు.. అదే చైతన్యం.. బాబు వచ్చేశారు!

నారా చంద్రబాబునాయుడు రాజమహేంద్రవరం జైలు నుంచి బయటకు వచ్చారు. ఎప్పుడూ నిలువెత్తు హుషారుగా, ఉత్సాహంగా కనిపించే చంద్రబాబు.. 53రోజుల అక్రమ నిర్బంధం తరువాత కూడా అదే హుషారు, ఉత్సాహంతో కనిపించారు. మనిషి ఒకింత నీరసించినట్లు కనిపించినా..  ఆయనలో ఉత్సాహం ఇసుమంతైనా తగ్గలేదు. అదే దరహాసం, అదే చైతన్యం ఆయనలో నిలువెల్లా కనిపించింది.

తనదైన ప్రత్యేక స్టైల్ లో విక్టరీ సింబర్ చూపుతూ ప్రజలకు అభివాదం చేస్తూ నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వచ్చిన ఆయన 53 రోజుల తరువాత చూసిన మనవడు దేవాన్ష్ కే ముద్దు పెట్టుకున్నారు. ఎదురు వచ్చిన పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని ఆత్మీయంగా  అలింగనం చేసుకున్నారు. స్కిల్ కేసులో అక్రమంగా అరెస్టైన చంద్రబాబుకు అరెస్టైన 52  రోజుల తరువాత ఆరోగ్య కారణాల దృష్ట్యా ఏపీ హైకోర్టు మంగళవారం (అక్టోబర్ 31) మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.

 ఈ 52  రోజులూ చంద్రబాబు కుటుంబ సభ్యులూ, తెలుగుదేశం నాయకులూ, శ్రేణులే కాదు.. యావత్ తెలుగు జాతీ చంద్రబాబు ఈ రోజు బయటకు వస్తారు, రేపు బయటకు వస్తారు  అని ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆయన  క్వాష్ పిటిషన్, బెయిలు పిటిషన్లు వాయిదాల మీద వాయిదాలు  పడుతూవస్తుండటంతో  ఒకింత అసహనానికి గురయ్యారు. మరింత ఆగ్రహానికిగురయ్యారు. చంద్రబాబు  అక్రమ అరెస్టునకు నిరసనగా గత 52 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సత్యాగ్రహాలు, సహా పలు రకాల కార్యక్రమాలతో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

ఎట్టకేలకు చంద్రబాబునాయుడు మధ్యంతర బెయిలుపై బయటకు రావడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. రాజమహేంద్రవరం  సెంట్రల్ జైలు వద్దకు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నాయకుడు, కార్యకర్తలు, సామాన్య జనం వచ్చి ఆయనకు ఘనస్వాగతం పలికారు.  ఆయనను చూసిన వెంటనే తెలుగుదేశం నాయకులు, శ్రేణులూ భావోద్వేగాలకు గురయ్యారు. పలువురు ఉద్వేగంతో కంటతడి పెట్టుకోవడం కనిపించింది. రాజమహేంద్రవరం జైలు వద్ద ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. తనకు సంఘీభావంగా నిలిచన అందరికీ కృతజ్ణతలు తెలిపారు.  అనంతరం రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ఆయన బుధవారం (నవంబర్ 1) తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమల నుంచి హైదరాబాద్ చేరుకుని అవసరమైన వైద్య చికిత్సలు చేయించుకుంటారని పార్టీ శ్రేణులు తెలిపాయి. 

అంతకు ముందు చంద్రబాబుకు బెయిలుపై స్పందించిన ఆయన సతీమణి భువనేశ్వరి.. చంద్రబాబుకు బెయిలు రావడం తనకే కాదు మొత్తం ప్రజలందరికీ అత్యంత సంతోషకరమైన విషయమని అన్నారు. ఈ సంతోషం మన అందరిదీ అని స్పందించారు. ఇది జనం విజయమని అన్నారు.  చంద్రబాబు క్షేమంగా జైలు నుంచి బయటకు రావాలని ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే రైలు దుర్ఘటన బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు భువనేశ్వరి తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu