రామమందిరం మళ్లీ రాజుకుంటోంది!

 

వందల సంవత్సరాలుగా రగులుగున్న రామమందిర వివాదం కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉండిపోయింది. బీజేపీ అధికారంలోకి వచ్చేయడం, దేశంలో ఇతరత్రా సమస్యలు చెలరేగడంతో రామమందిరం గురించి అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. కానీ గడచిన కొద్దిరోజులుగా వినిపిస్తున్న వార్తలను గమనిస్తే ఈ వివాదం మళ్లీ రాజుకుంటున్నట్లుగా తోస్తోంది.

 

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఒక ఉద్యమ రూపుని ఇచ్చేందుకు విశ్వహిందూ పరిషత్‌ మళ్లీ ప్రణాళికలను రచిస్తోంది. అందుకు అనుగుణంగా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని దాదాపు లక్ష గ్రామాలలో రామమందిరాలను నిర్మించాలంటూ ఆ సంస్థ శ్రీరామనవమిని ముహూర్తంగా నిర్ణయించింది. మరో పక్క అయోధ్యలో రామమందిర  నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామంటూ భాజపా నేతలు ప్రకటనలు చేస్తున్నారు. దీంతో రామమందిర అంశం మరోసారి దేశాన్ని ఆక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడని మనం తరతరాలుగా చదువుకుంటూ వస్తున్నాము. అయితే ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్న అయోధ్యే, మనం చదువుకుంటున్న అయోధ్య అని కొందరి నమ్మకం. అక్కడ రామజన్మస్థానంలో కట్టిన గుడిని కూలగొట్టి 15వ శతాబ్దంలో మొగలు చక్రవర్తి బాబరు మసీదుని కట్టించాడన్నది అసలు వివాదం. బాబరు అక్కడే ఉన్న గుడిని కూలగొట్టాడా లేదా అన్నది చెప్పడం కష్టం. కానీ అక్కడ ఒక గుడి ఉండేదన్న మాట మాత్రం వాస్తవమేనని తేల్చారు పురావస్తుశాఖవారు. బహుశా అక్కడ బాబరు మసీదుని నిర్మించే సమయానికే శిథిలమైపోయి ఉండవచ్చు. అందుకనే 15వ శతాబ్దంలో అయోధ్యలో నివసించిన తులసీదాసు వంటి చారిత్రక వ్యక్తులు సైతం ఆలయాన్ని కూల్చివేసినట్లు ఎక్కడా చెప్పలేదు.

18వ శతాబ్దం వరకూ కూడా అటు ముస్లింలు, ఇటు హిందువులూ ఈ మసీదుని పుణ్యక్షేత్రంగానే భావించేవారు. ముస్లింలు ఈ ప్రాంతాన్ని మసీద్‌-ఇ-జన్మస్థాన్‌గా పేర్కొంటూ హిందువులను మసీదు ప్రాంగణంలోకి అనుమతించేవారు. అయితే నిదానంగా మసీదుని కూల్చి రామాలయాన్ని నిర్మించాలన్న వాదనలు మొదలయ్యాయి. 1885లోనే ఇందుకు సంబంధించిన కోర్టు కేసులు కూడా మొదలయ్యాయి. ఆ సందర్భంగా ‘మసీదు ఉన్న ప్రదేశం హైందవులకు పుణ్యక్షేత్రమేననీ, అయితే వందల ఏళ్లు గడిచిపోవడం వల్ల ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదని’ ఆనాటి బ్రిటిష్‌ కోర్టు అభిప్రాయపడింది. రోజులు గడిచేకొద్దీ బాబ్రీమసీదు వివాదం ఓ ఉద్యమంగా మారసాగింది. 1949నాటికి కొందరు మసీదులోకి చొరబడి అక్కడ సీతారాముల విగ్రహాలను ప్రతిష్టించారు. ఆ విగ్రహాలను అక్కడి నుంచి తీసేయమని కేంద్ర ఆదేశించినా, మతఘర్షణలు చెలరేగుతాయన్న భయంతో వాటిని అక్కడే ఉంచేశారు. ఆ తరువాత చాలాకాలం వరకూ బాబ్రీమసీదు వివాదం నిద్రాణంగా ఉండిపోయింది.

 

1990లో భాజపా నేత నేత అద్వానీ రథయాత్రను ప్రారంభించడంతో బాబ్రీమసీదు వివాదానికి మళ్లీ రెక్కలొచ్చాయి. రోజులు గడిచేకొద్దీ, అద్వానీ రథయాత్ర సాగుతున్న కొద్దీ, దేశవ్యాప్తంగా హైందవులంతా ఉడుకెత్తిపోసాగారు. చాలాచోట్ల స్థానిక ప్రభుత్వాలు అద్వానీని నిలువరించాల్సి వచ్చింది. 1992, డిసెంబరు నాటికి అయోధ్య విషయంలో తాడోపేడో తేల్చుకునేందుకు లక్షమందికి పైగా జనం బాబ్రీమసీదుని చేరుకున్నారు. ఆ నెల 6వ తేదీన అయోధ్యలో... అద్వానీ, మురళీమనోహర్‌ జోషీ వంటివారి ప్రసంగాలు సాగుతుండగా ఉద్రేకపడిపోయిన జనం ఒక్కసారిగా మసీదుని ముంచెత్తి దానిని కూలగొట్టారు. నిజానికి బాబ్రీ మసీదుని కూల్చాలన్న ప్రణాళిక దాదాపు 10 నెలల ముందుగానే ఏర్పరుచుకున్నారనీ... ఇటు రాష్ట్ర ప్రభుత్వమూ, అటు కేంద్రమూ ఈ విషయంలో చూసీ చూడనట్లు ఉండిపోయాయని ఓ ఆరోపణ. ఆ సమయంలో ప్రధానమంత్రిగా ఉన్న పి.వి.నరసింహరావు సరిగా వ్యవహరించలేదంటూ, కాంగ్రెస్‌ పార్టీ ఓ అపవాదుని ఆయన మీదకు నెట్టివేసి చేతులు దులిపేసుకుంది. బాబ్రీ మసీదు కూల్చివేత దేశాన్ని ఒక్క పెట్టున కుదిపేసింది. మసీదు కూల్చివేత తరువాత జరిగిన ఘర్షణల్లో దేశవ్యాప్తంగా దాదాపు రెండువేల మంది చనిపోయినట్లు అంచనా! ముంబై మొత్తం మతఘర్షణలతో అతలాకుతలం అయిపోయింది.

 

అద్వానీ రథయాత్ర తరువాత బీజేపీ బలపడుతూ వచ్చింది. 2009లో ఏకంగా తన పార్టీ మేనిఫెస్టోలోనే ఆ పార్టీ రామమందిరాన్ని నిర్మిస్తామంటూ ఎన్నికల వాగ్దానం చేసింది. మరోపక్క న్యాయస్థానాలలో కూడా బాబ్రీమసీదు వివాదం పరిష్కారం దిశగా ముందుకు సాగింది. 2010, సెప్టెంబరులో అలహాబాదు హైకోర్టు ఈ వివాదానికి సంబంధించి ఓ చారిత్రాత్మక తీర్పునిచ్చింది. వివాదాస్పద మసీదు ప్రాంతాన్ని మూడు భాగాలుగా చేయాలనీ, వాటిలో ఓ భాగాన్ని వక్ఫ్‌ బోర్డుకీ, మరో రెండు భాగాలు హిందూ సంస్థలకు అందించాలనీ తీర్పునిచ్చింది. అయితే ప్రస్తుతానికి ఈ తీర్పు మీద సంబంధిత పార్టీలు తిరిగి సుప్రీంకోర్టుని ఆశ్రయించడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.

 

ఇప్పటికీ బాబ్రీ మసీదు మీద రకరకాల భావోద్వేగాలు చెలరేగుతూనే ఉన్నాయి. భిన్నమైన వాదనలు వినిపిస్తూనే వస్తున్నాయి. ఇతర మతస్తులకి, వారి ప్రవక్తల జన్మస్థానాలు ఎంత పవిత్రమో... హిందువులకి రామజన్మభూమి అంతే పవిత్రం అనేవారు ఉన్నారు. అసలు రాముడు పుట్టిన అయోధ్య ఇది కాదని, ఇప్పటి అయోధ్యకు ఆ పేరు 11వ శతాబ్దం నుంచే వచ్చిందనే వారూ ఉన్నారు. ఎవరేమన్నా బాబ్రీమసీదు సమస్య మాత్రం ఇటు ప్రభుత్వాలకీ, అటు న్యాయస్థానాలకీ ఓ కొరకరాని కొయ్యగానే మిగిలిపోయింది. ఇరు మతాల పెద్దలూ కూర్చుని పరిష్కరించుకుంటే కానీ ఈ సమస్యకు ఓ పరిష్కారం లభించడం అసాధ్యం. కానీ ఇరు మతాలకు చెందిన సంస్థలు ఆ భూమి మీద సర్వాధికారాలూ తమకే కావాలని పట్టుపట్టడంతో వివాదం ఎప్పటికీ సద్దుమణిగేట్లు కనిపించడం లేదు!