ఓటింగ్ పూర్తి కాక ముందే… జ్యోతిష్యం చెప్పినా ఊరుకునేది లేదు : ఈసీ!

 

ఎన్నికలు మొదలై… అన్ని దశలూ పూర్తి కాక ముందే… ఎవ్వరూ ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టటానికి వీలు లేదు! చివరకు, జ్యోతిష్యులు, పేక ముక్కలతో భవిష్యత్ చెప్పే టారోట్ రీడర్స్, న్యూమరాలజిస్టులు అయినా సరే! ఇది చెప్పింది ఎవరో కాదు… భారత దేశంలో అన్ని ఎన్నికలకు బాధ్యత తీసుకునే కేంద్ర ఎన్నికల కమీషన్! అసలు అలా ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చిందంటే ఈ మధ్య జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో వివిధ ఛానల్స్, పేపర్లు, వెబ్ సైట్లు తమ ఇష్టానుసారం ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. తరువాత వచ్చిన ఎగ్జాక్ట్ పోల్స్ అన్నిట్నీ తప్పని నిరూపించాయనుకోండి! అది వేరే విషయం. కాని, అసలు రూల్స్ కి విరుద్ధంగా మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ బయట పెట్టటం ఏంటని ఈసీ ప్రశ్నించింది!

 

సెక్షన్ 126A ప్రకారం ఎన్నికలు ఇంకా కొనసాగుతుండగానే ఛానల్స్, పేపర్లు, ఇతర మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ బయటపెట్టవద్దని ఈసీ సూచించింది. ఈ రూల్ అమలులో వున్నా కూడా మొన్న జరిగిన సుదీర్ఘ ఎన్నికల కాలంలో చాలా సంస్థలు నియమాన్ని పట్టించుకోలేదు. తమకు తోచిన పార్టీకి, తమకు నచ్చిన సంఖ్యలో సీట్లు ఇచ్చేస్తూ వచ్చారు. దీని వల్ల ఇంకా పోలింగ్ కు వెళ్లని నియోజక వర్గాల్లో జనం ప్రభావితం అయ్యే అవకాశం వుందని ఈసీ భావిస్తోంది. అలా జరుగుతుందని చెప్పే దానికి శాస్త్రీయమైన ఆధారాలు ఇప్పటికైతే లేవు. జనం చాలా సార్లు ఎగ్జిట్ పోల్స్ చెప్పిన పార్టీకి కాకుండా మరో పార్టీకే పట్టం కట్టారు. ఇది ఈ మధ్య జరిగిన అమెరికా ఎన్నికల దాకా ప్రపంచ వ్యాప్తంగా నడుస్తోన్న ట్రెండ్! చాలా తక్కువ ఓటర్లు వుండి, కేవలం ఇద్దరు అభ్యర్థుల మధ్య సాగే పోరులో కూడా అమెరికన్ మీడియా ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పులో కాలేశాయి! అవ్వి చెప్పినట్టు హిల్లరీ కాక ట్రంప్ వైట్ హౌజ్ ని కొల్లగొట్టాడు! ఇక మన దేశం లాంటి అతి పెద్ద దేశంలో, కులాలు, మతాలు, ప్రాంతాల కూడికలు, తీసివేతలు, భాగాహారాల నేపథ్యంలో… ఎవరు గెలుస్తారో చెప్పటం ఏ ఎగ్జిట్ పోల్ కు సాధ్యం కాదు! అయినా కూడా ఈసీ చివరి ఓటరు ఓటు వేసేదాకా ఎగ్జిట్ పోల్స్ బయట పెట్టి గందరగోళం సృష్టించొద్దని తాజాగా హెచ్చరించింది!

 

ఈసీ నిబంధనలు ఉల్లిఘించి ఎగ్జిట్ పోల్స్ చెప్పేస్తే ఏం చేస్తుందో క్లారిటీ లేదు. ఇంత దాకా ఏ మీడియా సంస్థకి అలా చేసినందుకు జరిమానాలు పడ్డ దాఖలాలు లేవు. అయితే, మీడియా వారు కూడా వ్యవస్థని గౌరవించి ఎగ్జిట్ పోల్స్ లాస్ట్ ఓటు కూడా పోల్ అయ్యాక జనానికి అందిస్తే మంచిది! ఎందుకంటే, నూటికి తొంభై సార్లు తప్పే అయ్యే ఎగ్జిట్ పోల్స్ వల్ల  దేశానికి వచ్చిన లాభమేం లేదు. కేవలం ఛానల్స్ టీఆర్పీలు, పేపర్లు సర్క్యూలేషన్ పెరగటం తప్ప! ఇక ఈసీ దృష్టి పెట్టాల్సిన మరో విషయం… ఎగ్జిట్ పోల్స్ బ్యాన్ చేసినా చేయకున్నా సాధ్యమైనంత తక్కువ దశల్లో ఎన్నికలు పూర్తి చేస్తే బావుంటుంది. నెలల తరబడి ఎన్నికల ప్రక్రియ దశల వారీగా సాగుతూ వుంటే పాలన స్థంభించటంతో పాటూ ఓటర్ల ఎంపికని ప్రభావితం చేసే బోలెడు సంఘటనలు, సందర్భాలు చోటు చేసుకోవచ్చు! కాబట్టి, ఎన్నికలు తక్కువ వ్యవధిలో పూర్తి చేసి ఫలితాలు వెంటనే ఎలా ఇవ్వవచ్చో ఈసీ ఆలోచించటం తక్షణ అవసరం!