ఆటోనగర్ సూర్య: షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ

 

తారాగణం: అక్కినేని నాగచైతన్య, సమంత, సాయికుమార్, జె.పి., భరణి, బ్రహ్మానందం, వేణుమాధవ్, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: శ్రీకాంత్, నిర్మాత: కె. అచ్చిరెడ్డి, మాటలు, దర్శకత్వం: దేవా కట్టా. ‘మనం’ సినిమా అందించిన విజయం తర్వాత ఆ ఉత్సాహంతో నాగచైతన్య, సమంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎప్పటి నుంచో విడుదలవుతానని ఊరిస్తు్న్న ‘ఆటోనగర్ సూర్య’ సినిమా ఎట్టకేలకు శుక్రవారం నాడు విడుదలైంది. ఈ సినిమా కథ విషయానికొస్తే, కథానాయకు సూర్య చిన్నప్పుడు ఒక రైలు ప్రయాణం సందర్భంగా తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు. అతన్ని మేనమామ (సాయికుమార్) కూడా ఆదరించడు. దాంతో సూర్య ఆటోనగర్‌లోని ఓ మెకానిక్ దగ్గర పెరుగుతాడు. తన తల్లిదండ్రుల మరణానికి కారణమైన మేయర్‌ మీద పగ తీర్చుకునే ప్రయత్నం చేయడం, ఆటోనగర్‌లో అక్రమాలను ఎదిరించే ప్రయత్నం చేయడంతో సూర్య పదహారేళ్ళ వయసులోనే జైలు జీవితాన్ని గడపాల్సి వస్తుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత సూర్య జీవితంలోకి ఎవరెవరు ప్రవేశిస్తారు? అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అతని తల్లిదండ్రులు ఎందుకు హత్యకు గురయ్యారు? సూర్య చివరికి తాను అనుకున్నది సాధించగలిగాడా అనే ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. నాగచైతన్య యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా నటించాడు. ప్రశంసనీయమైన నటన ప్రదర్శించాడు. ఎప్పటి నుంచో మాస్ ఇమేజ్ కోసం తపిస్తున్న నాగచైతన్య దాహాన్ని ఈ సినిమా కొంతవరకు తీర్చిందని చెప్పవచ్చు. ‘ఆటోనగర్ సూర్య’ సినిమా ద్వారా నాగ చైతన్య మాస్ ప్రేక్షకులకు దగ్గరవుతాడు. నాగ చైతన్యకు హిట్ పెయిర్ అయిన సమంత ఈ సినిమాలో సూర్య మరదలిగా నటించింది. గ్లామర్ ప్రధానంగా ఈ పాత్ర సాగింది. కొన్ని సన్నివేశాలలో సమంత ప్రశంసనీయమైన నటన ప్రదర్శించింది.‘సురా..సురా’ అంటూ సాగే పాటలో సమంత తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. సమంతకు తండ్రిగా, నాగచైతన్యకు మేనమామగా, యూనియన్ లీడర్‌గా నటించిన సాయికుమార్‌కి ఇలాంటి పాత్రలు కొట్టినపిండి కావడంతో చాలా ఈజ్‌గా పోషించారు. దర్శకత్వం: వెన్నెల, ప్రస్థానం చిత్రాలతో తన దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్న దేవా కట్టా మరోసారి తనలోని దర్శకుడి మెరుపులను ఈ సినిమాలో మెరిపించారు. ఈ సినిమాకి మాటల రచయిత కూడా తానే అయిన దేవా కట్టా ఆ రంగంలోనూ తనకు ప్రతిభ వున్న విషయాన్ని నిరూపించుకున్నారు. మొత్తమ్మీద యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu