మన స్కాముల్లో మరో కలికితురాయి... అగస్టా!
posted on Apr 28, 2016 10:29AM

ఏ దేశమైనా నూటికి నూరు శాతం అవినీతి రహితంగా ఉంటుందని ఆశించలేం. ఎంత కట్టుదిట్టమైన చట్టాలు ఉన్నా ఏదో ఒక మూల, ఎవరో ఒక అవినీతిపరుడు చేయి చాచి నిల్చొని ఉంటాడని మనకి తెలుసు. కానీ సాక్షాత్తూ దేశాన్ని కాపాడవలసి రక్షణశాఖ అధికారులే అవినీతిలో కూరుకుపోతే! లోకమంతా ఆ అవినీతి గురించి దుమ్మెత్తిపోస్తున్నా, మనం మాత్రం నిర్లిప్తంగా ఉండిపోతే!... అంతకంటే దౌర్భాగ్యం మరోటి ఉండదేమో. ఆ దౌర్భాగ్యానికి మరోపేరే అగస్టా కుంభకోణం.
ఇదీ నేపథ్యం!
2000 సంవత్సరం నాటికి మారుతున్న అవసరాల దృష్ట్యా, మన వైమానిక దళానికి కొత్తతరకం హెలికాప్టర్లు అవసరమయ్యాయి. దేశంలోని ప్రముఖుల పర్యటనలకే కాకుండా, సియాచిన్ వంటి ఎత్తైన ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించేందుకు.... మరింత సమర్థవంతమైన హెలికాప్టర్లు కావల్సి వచ్చాయి. ఇందుకోసం 18,000 అడుగుల ఎత్తులో కూడా ఎగిరే హెలికాప్టర్ల కోసం వైమానిక దళం వెతుకులాట ప్రారంభించింది. 2004లో ఎస్.పీ.త్యాగి వైమానికదళ ముఖ్యునిగా పదవిని చేపట్టడంతో ఈ వెతుకులాట మరో మలుపు తిరిగింది. ఇటలీకి చెందిన అగస్టా సంస్థ రూపొందించిన హెలికాప్టర్లకు అనుగుణంగా త్యాగి నిబంధనలలో తగిన మార్పులు చేయడం మొదలుపెట్టారు. ఉదా॥ అగస్టా హెలికాప్టరు కేవలం 15,000 అడుగుల ఎత్తుకి మాత్రమే చేరుకోగలదు. కాబట్టి దీనికి అనుగుణంగా వైమానిక నిబంధనలను 18,000 అడుగుల నుంచి 15,000 అడుగులకి మార్చిపారేశారు త్యాగి. అలాగే వైమానిక దళం హెలికాప్టర్లలో ఎలాంటి సౌకర్యాలని ఆశిస్తోందో ఎప్పటికప్పుడు ఆగస్టాకు త్యాగి చేరవేశారనే ఆరోపణలూ ఉన్నాయి. త్యాగి చేసిన సాయానికి అగస్టా నుంచి ఆయనకు కనీసం 75 కోట్లు ముట్టి ఉంటాయని సాక్షాత్తూ ఇటలీ న్యాయస్థానమే స్పష్టం చేసింది.
అందరి చేతులూ తడిపారు
ఆగస్టా వెస్టల్యాండ్ సంస్థ రూపొందించిన AW-101 అనే హెలికాప్టర్లను మన దేశానికి అంటగట్టేందుకు ఇక దళారులు రంగంలోకి దిగారు. వీరు మొదటి త్యాగిని వశపరుచుకున్నట్లు ఎలాగూ ఆరోపణలు ఉన్నాయి. ఆ తరువాత దేశంలో కీలక నిర్ణయాలను తీసుకునే అధినేతలని కూడా వారు చేరుకున్నట్లు సమాచారం. నకిలీ సంస్థలు, నకిలీ ఒప్పందాలు... ఇలా రకరకాల మార్గాల ద్వారా అగస్టా నుంచి భారతీయ నాయకులకు 300 కోట్లకు పైగా లంచాలు అందాయన్నది కుంభకోణంలోని ప్రధాన ఆరోపణ. ఒకానొక దశలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.ఆర్ అల్లుడైన బ్రదర్ అనిల్ కుమార్ పేరు కూడా ఈ కుంభకోణంతో పాటు వినిపించింది. బహుశా అగస్టా హెలికాప్టర్లకు సంబంధించిన వేలకోట్ల ఒప్పందం పూర్తయిపోయి ఉంటే ఈ సమాచారం అంతా సద్దుమణిగిపోయేదేమో! కానీ అన్ని దేశాలూ మనలా నిర్లిప్తంగా ఉండవు కదా! 2013లో అగస్టాల్యాండ్ ముఖ్యాధికారితో పాటు మరో దళారికి ఇటలీ ప్రభుత్వం అరెస్టు చేసింది. హెలికాప్టర్ల ఒప్పందం కోసం భారతీయ నేతలకు, అధికారులకు ఇబ్బడిముబ్బడిగా లంచాలు అందించారన్నది వీరి మీద మోపబడిన అభియోగం. కేవలం అభియోగం మోపడమే కాదు. వారిద్దరికీ కారాగార శిక్షను కూడా విధించి పారేసింది.
మరి మన దగ్గరో!
లంచం ఇచ్చినందుకే ఇటలీ కోర్టులు ఇంత దూకుడుగా వ్యవహరిస్తే మనం ఇంకెంత దూకుడుగా ఉండాలి. కానీ రక్షణ విషయంలో కూడా కక్కుర్తి పడి లంచం తీసుకున్న మన నేతల మీద ఈగ వాలే ప్రమాదం కూడా లేకుండా పోయింది. అగస్టా ల్యాండ్ కుంభకోణం బయటపడిన వెంటనే ఆ సంస్థతో ఒప్పందాలన్నీ రద్దు చేసేశాం అని అప్పడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చెబుతోంది. కానీ ఆపాటికే 300 కోట్లకి పైగా సొమ్ములు చేతులు మారాయన్నది విస్పష్టం. పైగా దళారుల మాటలు, ఉత్తరాల ప్రకారం అప్పటి రక్షణ శాఖకు చెందిన అధికారులే కాదు... మంత్రులు, కార్యదర్శులు, సలహాదారులు... ఇలా అధికారంలో ఉన్న అంచెలన్నింటికీ లంచాలు ముట్టినట్లు తెలుస్తోంది. పైగా ఒకానొక ఉత్తరంలో సోనియా పేరు కూడా రావడం గమనార్హం! కానీ ఎప్పటిలాగే ఈ కేసులో విచారణ నత్తనడక నడుస్తోంది. కనీసం ప్రాథమిక అభియోగాలను సైతం స్పష్టంగా నమోదు చేయలేని నిస్సహాయత నెలకొని ఉంది.
అధికారపక్ష వ్యూహం!
అగస్టా విషయంలో అధికార పక్షం తీరు కూడా ఆశ్చర్యంగా ఉంది. అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావస్తున్నా నిమ్మళంగా ఉన్న బీజేపీ అకస్మాత్తుగా ఇప్పుడు అగస్టా కుంభకోణాన్ని తలకెత్తుకుంది. జేఎన్‌యూ విశ్వవిద్యాలయం, ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన, కరువు... వంటి సమస్యల సుడిగుండంలో ఉన్న బీజేపీకి అగస్టా కుంభకోణం ఓ సంజీవనిలా దొరికింది. సుబ్రమణ్య స్వామిని రాజ్యసభకు ఎన్నుకోవడం వెనుక కూడా అగస్టా వంటి కుంభకోణాలను తిరగతోడటమే లక్ష్యంగా కనిపిస్తోంది. ఇలాంటి విషయాలలో నిప్పుని నిర్భయంగా రాజేసే సుబ్రమణ్య స్వామి సహజంగానే నిన్న రాజ్యసభలో అగస్టా కుంభకోణాన్ని, అందుకు జోడింపుగా సోనియా పేరునీ ప్రస్తావించారు. దాంతో ఒక్కసారిగా కాంగ్రెస్ కుంపటిలా మారిపోయింది.
అసలు పని!
అగస్టా విషయంలో తన పేరుని ప్రస్తావించడం మీద సోనియా తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఈ ఆరోపణలను నిరూపించాలంటూ సవాలు చేశారు. నిజంగా ప్రభుత్వం చేయాల్సిన పని కూడా ఇదే! లంచాలు ఇచ్చినందుకే ఇటలీలో కొందరు జైళ్లో కూర్చుంటే, ఆ లంచాలు ఎవరెవరికీ ఏ స్థాయిలో చేరాయో నిగ్గు తేల్చడం ప్రభుత్వ బాధ్యత. అలా కాకుండా ఎన్నికలప్పుడో, ప్రతివిమర్శలు చేయడానికో ఈ ఆరోపణలు వినియోగించుకోవాలనుకుంటే అంతకంటే దురదృష్టం మరోటి ఉండదు. ఇలాంటి కుంభకోణాల విషయంలో చూసీచూడనట్లు ఊరుకుంటే సాధారణ ప్రజల నమ్మకం ఎలాగూ సన్నగిల్లుతుంది... కానీ సాక్షాత్తూ రక్షణశాఖలోనే ఇలాంటి కుంభకోణాలు బయటపడుతుండే మన సైనికుల నైతిక స్థైర్యం ఏమైపోవాలి. దేశం లోపల మనం తిట్టుకున్నా కొట్టుకున్నా, మన స్వేచ్ఛ కోసం తమ ప్రాణాలను బలిపెట్టే వారి ధైర్యం ఏమైపోవాలి. అలనాటి బోఫోర్సులాగా ఇది కూడా నిదానంగా సద్దుమణిగిపోతుందిలే అని నిర్లిప్తంగా ఊరుకుండిపోవాలేమో!