డిల్లీ ప్రజలకు అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణ

 

విశేష ప్రజాధారణతో డిల్లీ ముఖ్యమంత్రి పీటం అధిరోహించిన ఆమాద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్, సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేవలం 49 రోజులలోనే కుంటి సాకులతో పదవి నుండి దిగిపోయారు. కానీ సార్వత్రిక ఎన్నికలలో డిల్లీలో కూడా ఘోర పరాజయం పాలవడంతో, ఇప్పుడు తీరికగా పశ్చాతాపపడుతూ, ప్రజలను తన తొందరపాటుకి క్షమించమని కోరారు. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చెప్పట్టగానే. డిల్లీ శాసనసభకు ఎన్నికలు నిర్వహిస్తే, బీజేపీయే విజయం సాధించే అవకాశాలు ఎక్కువుంటాయి గనుక బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ తప్పనిసరిగా తనకే మద్దతు ఇస్తుందనే ధీమాతో కేజ్రీవాల్ డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ని నిన్న కలిసి ప్రభుత్వాన్ని రద్దు చేయకుండా తనకే మరో అవకాశం ఇవ్వాలని అభ్యర్ధించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతు ఇచ్చేందుకు నిరాకరించిడంతో ఏమిచేయాలో పాలుపోక మళ్ళీ ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్దపడుతూ ముందుగా వారిని క్షమాపణలు కోరారు. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని వదులుకొని తప్పు చేసానని ఆయనే స్వయంగా చెప్పుకోవడం వలన ప్రజలలో మరింత చులకన అవుతారు. ఇక ఆమాద్మీ పార్టీ పదవులు, అధికారం కోసం ప్రాకులాడే పార్టీ కాదని పదేపదే చెప్పుకొన్న అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు ఇతర రాజకీయ నేతలలాగే అధికారం కోసం ప్రాకులాడుతూ, ఉన్న పరువు కూడా పూర్తిగా పోగొట్టుకొంటున్నారు. ఒక అపూర్వమయిన అవకాశాన్ని కాలదన్నుకొని, ఇప్పుడు ప్రజలను ఎంత బ్రతిమాలుకొన్నా ప్రయోజనం ఉండదని ఆయన గ్రహిస్తే మంచిది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu