బెయిల్ రాకూడదనే రాజ‌ద్రోహం కేసు.. సుప్రీంలో వాడివేడి వాద‌న‌లు..

ఎంపీ రఘురామకృష్ణ రాజు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంలో వాడివేడి వాద‌న‌లు జ‌రిగాయి. రఘురామ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి ప‌లు కీల‌క అంశాల‌ను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. త‌న‌ను సీఐడీ క‌స్ట‌డీలో టార్చర్ పెట్టార‌ని.. ఆ త‌ర్వాతే మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారని రఘురామ తనతో చెప్పారని రోహ‌త్గి అన్నారు. ఎంపీపై చాలా సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదయ్యిందని.. అందులో సెక్షన్‌ 124ఏ చాలా ముఖ్యమైందని తెలిపారు. ర‌ఘురామ‌కు బెయిల్‌ రాకూడదనే ఉద్దేశంతోనే సెక్షన్‌ 124ఏ కింద కేసు నమోదు చేశారని కోర్టుకు నివేదించారు రోహత్గి. 

సీఎంపై డజన్‌కు పైగా కేసులు ఉన్నాయంటూ కోర్టుకు రోహత్గి విన్నవించారు. రఘురామకృష్ణరాజు ఏపీలో అధికార పార్టీకి చెందిన ఎంపీ. ప్రభుత్వానికి, సీఎంకు అనేక విషయాల్లో సూచనలు చేశారు. కానీ సీఎం వాటిని పట్టించుకోలేదు. ఒక రెడ్డి కులానికే ముఖ్య‌మంత్రి ప్రాధాన్యత కల్పిస్తూ వెళ్లారు. ఈ అంశాలపై ర‌ఘురామ విమర్శలు చేస్తూ వచ్చారు. అలాగే సీఎం బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ కూడా వేశారని రోహ‌త్గి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు అభ్యంత‌ర తెలుపిన ఏపీ ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది.. ఆ కేసులో సీఎం ప్రతివాది కాదు. ఆయనను ఇందులోకి లాగవద్దు. సీఎంపై ఆరోపణలు చేయాలంటే ఆయన్ను ప్రతివాదిగా చేర్చండన్నారు. 

ఆర్మీ ఆస్పత్రి నివేదికతో తాము విభేదించమని, ఆస్పత్రిపై తమకు ఎంతో విశ్వాసం ఉందని దవే చెప్పారు. కానీ ఆర్మీ ఆస్పత్రి నివేదిక అసంపూర్ణంగా ఉందని ఆయన తప్పుబట్టారు. ఎక్స్‌-రే, వైద్య నివేదికలు స్పష్టంగా ఉన్నాయి కానీ.. రెండు నివేదికల మధ్య ఏదో జరిగిందనే అనుమానం ఉందన్నారు. గుజరాత్ సొసైటీ కేసు తీర్పు ఆధారంగా ఈ కేసును డిస్మిస్ చేయాలని న్యాయమూర్తిని దవే అభ్యర్థించారు. ఈ కేసులో ఆర్టికల్ 136ని అసంబద్ధంగా ఉపయోగించారని, హైకోర్టులో విచారణ ఇంకా పూర్తికాలేదని దవే తెలిపారు. 

ఒక ఎంపీగా ఆయన మాట్లాడే మాటలకు బలం ఎక్కువగా ఉంటుందని, ఆయన మాటలతో చట్టాన్ని చాలా మంది చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉంటుందని దవే పేర్కొన్నారు. కోవిడ్-19 పరిస్థితుల్లో శాంతిభద్రతలను కాపాడడం మరో సవాలుగా మారుతుందని, అందుకే సీనియర్ పోలీస్ ఆఫీసర్ దీనిపై ప్రాథమిక విచారణ జరిపారని తెలిపారు. దాదాపు 45 వీడియోలను పరిశీలించారని, కేవలం విమర్శలకు పరిమితం కాలేదు. తన ఫాలోవర్లను రెచ్చగొట్టి గొడవలు సృష్టించేలా, రెడ్డి, క్రిస్టియన్ కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ మాట్లాడారని దవే కోర్టు దృష్టికి తెచ్చారు. కులం, మతం ఆధారంగా సమాజంలో అలజడి సృష్టించేలా రఘురామరాజు ప్రయత్నించారని, ఇవన్నీ 124(ఏ) పరిధిలోకి వచ్చే చర్యలుగా పరిగణించాలని దవే సుప్రీంకోర్టును కోరారు.

రోహత్గి వాద‌న‌లు కొన‌సాగిస్తూ.. మే 14న గుంటూరు పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. సీఐడీ ఏడీజీ స్వయంగా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. సీఐడీ ఏడీజీ ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసి, ఆ రిపోర్ట్ ఆధారంగా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశానని చెబుతున్నారు. చాలా సెక్షన్లు పెట్టారు. బెయిల్ రాకుండా చేయడం కోసం ఐపీసీ 124(ఏ) కూడా పెట్టారు. మే 14న రఘురామ పుట్టినరోజు. ఆ రోజు అరెస్టు చేసి 300 కి.మీ దూరం తీసుకెళ్లారు. రఘురామను చిత్రహింసలు పెట్టి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ స్వయంగా తన కాళ్లపై ఉన్న గాయాల గుర్తులు చూశారని రఘురామ నాతో చెప్పారు. 

24 గంటలలోపే ర‌ఘురామ‌ను కోర్టులో హాజరుపరిచారా? అని ధ‌ర్మాస‌నం ప్ర‌శ్నించ‌గా.. రోహ‌త్గి అవున‌ని స‌మాధానం చెప్పారు. మేజిస్ట్రేట్ మెడికల్ రిపోర్ట్ కోరారు. కానీ ఆ రిపోర్ట్ అంతా నార్మల్ అని ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చిన డాక్టర్ గైన‌కాల‌జిస్ట్‌. ఆమె భర్త వైసీపీ లీగల్ సెల్ నేత. ఆ నివేదిక‌పై అనుమానాలు ఉన్నాయ‌ని కోర్టుకు తెలిపారు రోహ‌త్గి.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu